ఎయిడ్స్ బాధితులకు రూ.2.25 కోట్లు కార్పస్ ఫండ్..


Ens Balu
3
Srikakulam
2020-12-01 19:14:22

అభం శుభం తెలియని ఎయిడ్స్ బాధిత చిన్నారుల కోసం రూ.2.25 కోట్లతో కార్పస్ ఫండ్  ఏర్పాటుచేసామని, ఈ నిధి నుండి చిన్నారులకు అవసరమైన న్యూట్రీషన్ ఫుడ్ ను ఈ నెల నుండే అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 230 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులు ఉన్నారని, ఎయిడ్స్ అంటే ఏమిటో కూడా తెలియని అభం శుభం చిన్నారులు వారని అన్నారు.  అటువంటి చిన్నారులను ఆదుకునేందుకు రూ.2.25 కోట్లతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు.  ఈ నిధి నుండి చిన్నారులకు అవసరమైన న్యూట్రీషన్ ఫుడ్ ను ఈ నెల నుండే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎయిడ్స్ బాధిత చిన్నారులను పాఠశాలల్లో చేర్చకపోవడంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, రెడ్ క్రాస్ మరియు సి.వి.నాగజ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక గదిని కేటాయించి అటువంటి చిన్నారులకు ఉచిత విద్యాబోధన ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇవేకాక ఎయిడ్స్ బాధిత చిన్నారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేస్తామని, ఎట్టి పరిస్థితిల్లో వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నివిధాల ఆదుకుంటామని వివరించారు. ఈ సమావేశం అనంతరం 17 రకాల న్యూట్రీషన్ కిట్ ను 20 మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులకు కలెక్టర్ అందించారు.         ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లీల, పి.శ్రీకాంత్, నిక్కు అప్పన్న, పెంకి చైతన్యకుమార్, నటుకుల మోహన్, శ్రీధర్, సంతోశ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.