పూజారుల పై దాడి అమానుషం..


Ens Balu
4
Ongole
2020-12-01 19:29:30

కార్తీక పౌర్ణమి రోజున భక్తులకు ఉచిత దర్శనం సమయంలో టికెట్లు అమ్మడం సముచితం కాదని వారించిన పూజారి పై ఆలయ చైర్మన్ కొరడాతో దాడి చేయడం అమానుషమని పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘాలు సభ్యులు స్థానిక ఒంగోలు బస్టాండ్ వద్ద గల పాండురంగ స్వామి దేవస్థానం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో బండి ఆత్మకూరు ఓం కార క్షేత్రం లో ఈ సంఘటన జరిగిందని తక్షణం ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని అందచేసారు.ఈ సందర్భంగా ఆదిశైవ సంఘం అధ్యక్షుడు శేషగిరిరావు మాట్లాడుతూ ఆలయం బాగోగులు చూడాల్సిన చైర్మన్  దైవ సన్నిధిలో పూజారిని కొట్టడం హేయమని విచారం వ్యక్తం చేసారు.అర్చక పురోహిత సంఘం రాష్ట్ర నాయకుడు గుండాపంతుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, దేవుడికి భక్తులకు అనుసంధానంగా పూజలు నిర్వహించే అర్చకులపైనే ఇలా భౌతిక దాడులు చేయడం తీవ్రమైన ఘటనగా దేవాదాయశాఖ పరిగణించి గట్టి చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల పెద్దలు మూర్తి స్వామి, ప్రసాద్, రాజేంద్ర, మల్లికార్జున్ శర్మ,భాస్కర శర్మ ,తెలికేపల్లి శేషయ్య, కిట్టు స్వామి, అయ్యప్ప గుడి అర్చకులు నాగమల్లేశ్వరరావు ,విశ్వబ్రాహ్మణ అర్చక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.