మడకశిర పర్యాటక అభివ్రుద్ధికి చర్యలు..


Ens Balu
2
Anantapur
2020-12-01 19:37:58

అనంతపురం జిల్లాలోని మడకశిరలో 26 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు టూరిజం అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్లోని తన ఛాంబర్లో  మడకశిర ట్యాంక్ బండ్ అభివృద్ధి, ట్యాంక్  ఎదురుగా ఉన్న ప్రదేశంలో టూరిజం హోటల్, రిక్రియేషన్ జోన్ ఏర్పాటుపై కలెక్టర్ టూరిజం అధికారులతో చర్చించారు. మడకశిర ట్యాంక్  ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న టూరిజం హోటల్ తో పాటు రిక్రియేషన్ జోన్ లో భాగంగా షాపులు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలం ,బాంకెట్ హాల్, స్పోర్ట్స్, అడ్వెంచర్స్ ,సైన్స్ మ్యూజియం యాంఫిథియేటర్ ,పార్కింగ్ ,టాయిలెట్స్  లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.  అలాగే ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయడంలో భాగంగా ఫుడ్ కోర్టులు, ఫౌంటైన్, బోటింగ్ సౌకర్యం, మైజ్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, శిల్పాలు, ట్యాంక్ బండ్ కు పర్యాటకులు వెళ్లేందుకు పాత్ వే లతో కూడిన పనులు చేపట్టేలా ప్రతిపాదనలలో చేర్చాలన్నారు.  26 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ పర్యాటక అభివృద్ధి పనులకు  సంబంధించి ఎస్టిమేట్లతోపాటు,సంపూర్ణంగా ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ టూరిజం అధికారులను ఆదేశించారు. వారి నుండి ప్రతిపాదనలు అందిన వెంటనే ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో టూరిజం   రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య,  జిల్లా టూరిజం అధికారి దీపక్  పాల్గొన్నారు.