ప్రైవేటు వైద్యంపై నమ్మకం కలిగించండి..


Ens Balu
3
Srikakulam
2020-12-01 20:13:07

ప్రజలకు ప్రైవేటు వైద్యంపై నమ్మకం కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్ పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేటు  ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా డి.అండ్.హెచ్.ఓ. చంద్ర నాయక్ మాట్లాడుతూ, ప్రైవేటు వైద్య శాలలు, క్లినిక్ లు  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిబంధనలను  విధిగా పాటించాలని తెలిపారు.  ఆసుపత్రులలో ఏ యే వైద్యం చేస్తున్నారు, వాటి ఖర్చుల వివరాలను బోర్డుపై డిస్ప్లే చేయాలన్నారు.  ఆసుపత్రులలో చేస్తున్న వినిధ వైద్య పరీక్షలకు ఎంత ఖరీదు అవుతున్న విషయం ప్రజలకు తెలియ చేయాలన్నారు. ప్రజలకు  వైద్యసేవలను సక్రమంగా అందించాలని, అదే విధంగా వారిని సక్రమంగా రిసీవ్ చేసుకోవాలని తెలిపారు.  కరోనా సమయంలో ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులంతా సంయుక్తంగా పని చేసారని, కరోనా వ్యాప్తి నిరోధానికి చేసిన సేవలను ప్రశంసించారు.   ముఖ్యంగా జిల్లాలో కరోనా  మరణాల సంఖ్య తగ్గించడం జరిగిందని, ఇకపై సెకెండ్ వేవ్ రాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  సామాజిక దూరం, మాస్కులను వుపయోగించడం తప్పని సరి అని అన్నారు.  సానిటైజర్లను తప్పని సరిగా వుపయోగించాలని, ఇంట్లో మాత్రం సబ్బును వుపయోగించాలని చెప్పారు.  కరోనా సమయంలో  సానిటైజేషన్, వంటి ఆరోగ్యకరమైన  అలవాట్లను పాటించడం ద్వారా ఇప్పటి వరకు సీజనల్ వ్యాధులు ప్రబల లేదన్నారు.  త్వరలోనే కరోనా వేక్సిన్ వస్తుందని, మొదటి విడతలో కరోనా వారియర్స్ కు, రెండవ విడతలో వృ ధ్ధులు, పది సంవత్సరాల లోపు వయస్సు కల పిల్లలకు, వేయడం జరుగుతుందన్నారు.   మూడవ విడతలో అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు.  కరోనా వంటి ఖరీదైన వైద్యంపై  ప్రజలకు వివరంగా తెలియ చేయాలన్నారు.  మందుల ఖరీదు వివరాలను ఖచ్చితంగా తెలియచేసి, నర్సింగ్ హోమ్ లపై  విమర్శలకు తావు లేకుండా పని చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లు , కొత్త   నర్సింగ్ హోమ్ లకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి అని, పాత ఆసుపత్రులను కూడా ఆన్ లైన్ చేసుకోవాలని తెలిపారు.  ఆసుపత్రి పరిసరాలలో పరిశుభ్రత పాటించాలన్నారు.  ఆసుపత్రులను  తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఐ.ఎం.ఎ. నిబంధనలు పాటిస్తూ, వైద్యానికి వచ్చిన రోగులకు మంచి సేవలందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావలని  తెలిపారు.                         ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాధం, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు డా. కె.అమ్మన్నాయుడు, డా.సి.హెచ్.కృష్ణ మోహన్, డా.భీమారావు, డా.ఎస్.సంతోష్, మెట్ట మధు, డా. జి.వరహాల నాయుడు, కిమ్స్, జెమ్స్, తదితర ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.