స్మార్ట్ సిటీ పనులు నాణ్యతగా చేపట్టాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-01 20:20:20
జివిఎంసీ పరిధిలోని స్మార్ట్ సిటీ అభివ్రుద్ధి పనులను వేగంగా, నాణ్యతగా పూర్తిచేయాలని కమిషనర్ డా. జి. సృజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్మార్ట్ సిటీ పధకం క్రింద నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఎం.వి.పి. కోలనీలోగల ఏ.ఎస్. రాజా గ్రౌండ్ నందు నిర్మాణ దశలో వున్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. పనులు మందకొడిగా కోనసాగుతున్నాయని తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. పూర్తిగా పనులపై శ్రద్ధ వహించి త్వరితగతిన స్టేడియం పనులు పూర్తి చేయాలని లేక పొతే తగుచర్యలు గైకొంటామని సంబందిత కాంట్రాక్టరును హెచ్చరించారు. మరో పది రోజులలో వచ్చి తనిఖీ చేస్తామని అప్పటికీ పనులు సంతృప్తిగా ఉండాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు.
రామకృష్ణ మిషన్ రోడ్డు ఆధునీకరణ పనులను పరిశీలించి, సంబందిత కాంట్రాక్టరుతో మాట్లాడుతూ ఎక్కువమంది పనివారిని, వస్తు సామగ్రిని ఏర్పాటు చేసుకొని నిర్ణీత గడువులోగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లేకపొతే తగు చర్యలు చేపడతామని హెచ్చరించారు. తదుపరి బీచ్ రోడ్డులో ఉన్న వారసత్వ భవనాలు, టౌన్ హాలు, పాత మున్సిపల్ భవనాన్ని పరిశీలించి డిశంబరు నెలలోగా పనులు పూర్తిచేయాలని సంబందిత కాంట్రాక్టరును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, స్మార్ట్ సిటీ కన్సల్టన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.