సచివాలయ ఉద్యోగులు నియమావళి పాటించాలి..
Ens Balu
3
Srikakulam
2020-12-01 20:26:03
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. మంగళ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు డివిజనల్ స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అత్యంత ప్రాముఖ్యత నిస్తున్నదన్నారు. అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే పొందే సౌలభ్యాన్ని కలిగించడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరు వారి విధులను అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. ప్రజలకు సేవలను అందించే మంచి అవకాశం సచివాలయ ఉద్యోగులకు లభిస్తున్నదన్నారు. తమ విధులు, బాధ్యతలను సచివాలయ ఉద్యోగులు పూర్తిగా తెలుసు కోవాలన్నారు.
ప్రజలకు సకాలంలో సక్రమంగా సేవలను అందించాలని తెలిపారు. ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన సచివాలయాల సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొనడం జరిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త సంచాలకులు మొగిలిచెండు సురేశ్ సచివాలయ ఉద్యోగుల నియమావళి, సీసీఏ నియమావళి పెనాల్టీ, కార్యాలయ నడవడిక/సమాచార ప్రసార నడవడిక తదితర విషయాలపై అవగాహన కలిగించారు. ప్రభుత్వ ఉద్యోగులలో ప్రవర్తన, పనితీరు అత్యంత కీలకమైన అంశాలని తెలిపారు. "వ్యక్తిత్వము, విశ్వసనీయత ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కలిగి వుండవలసిన రెండు ప్రధాన లక్షణాలు" అనే ముఖ్యమంత్రి ఆశయాలను నెరవేర్చాలన్నారు. "విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు"
అన్న మహాత్మా గాంధీ సూక్తితో ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలన్నారు. ప్రతి ఉద్యోగి సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రజల ముంగిటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మన ప్రభుత్వం స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. గ్రామంలో 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి, వేకువ ఝామునే, సూర్య కిరణాలు పింఛనదారుల ఇంటి తలుపులను తాకకముందే, పింఛన్లు వారి గడప వద్దనే అందజేసే బృహత్తర లక్ష్యాన్ని సాధించడంలో మన ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ప్రజలతో మమేకమై, మృదు మధుర భాషణతో ప్రజలకు సత్వరమే సేవలందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి రమా ప్రసాద్, జిల్లా పరిషత్ డిప్యూటీ సి ఈ ఓ లక్ష్మీ పతి, ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.