7నుంచి మనమూ మన పరిశుభ్రత..
Ens Balu
3
Visakhapatnam
2020-12-05 10:22:13
విశాఖజిల్లాలో డిసెంబరు7వ తేది నుంచి 21వరకూ మనమూ-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి తెలియజేశారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామసచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని కార్యదర్శిలు, ఇతర సిబ్బందితో కలిసి 15 రోజుల పాటు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు, డ్వాక్రాసంఘాలు ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు. మనమూ-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలున్నందున ప్రతీ గ్రామసచివాలయంలో దీనిని ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో ప్రజలను చైతన్య పరుస్తూ వ్యర్ధాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలను గ్రామవాలంటీర్ల ద్వారా వారికి కేటాయించిన కుటుంబాలకు వివరించాలన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని జిల్లాలోని గ్రామ సచివాలయాలకు పంపినట్టు ఆమె వివరించారు. ఇప్పటికే తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతీ ఇంటి నుంచి కలెక్షన్ చేపడుతున్న విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత వుందన్నారు. వ్యర్ధాలపై పోరాటాన్ని నిరంతరం చేయడం ద్వారా మన ఇంటిని, పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలుపడుతుందని ఆమె వివరించారు.