జిజిహెచ్ లో అధునాతన రేడియోగ్రఫీ సేవలు..
Ens Balu
1
Kakinada
2020-12-05 13:24:58
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అన్నారు. శనివారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ కేంద్రాన్నిఆమె ప్రారంభించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ కేంద్రం ద్వారా రోగులకు చాలా సులువుగా త్వరితగతిన ఎక్స్ రే సేవలు అందించవచ్చని జేసీ తెలిపారు. తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రక్రియ ఆధారంగా రోగ నిర్ధారణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.17 లక్షలు ఖర్చయినట్లు కోరమాండల్ యూనిట్ హెడ్ ఎస్.రవికిరణ్ తెలిపారు. గతంలో కూడా రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి సహకారం అందించామని, భవిష్యత్తులోనూ సహకారం కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంవో గిరిధర్, కోరమాండల్ జీఎం పి.పద్మనాభం, ప్రతినిధులు వేణు, వంశీ, నాగేశ్వరరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.