పతాక నిధికి విరాళాలు అందించండి..


Ens Balu
3
Srikakulam
2020-12-05 14:29:59

భారతదేశంలోని సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించాలని జిల్లాసైనిక సంక్షేమ అధికారి జి.సత్యానందం కోరారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.. సాహసోపేత వీర జవానులకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతను అందించుటకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందని అన్నారు. పాకిస్తాన్, చైనాల యుద్ధ సమయంలోనూ, కార్గిల్ పోరాటంలోను, ముంబాయి తాజ్ మహల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సైనికుల ధైర్య సహాసాలకు, తెగువకు మరో పేరుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఎంతో మంది సైనికులు దేశ రక్షణకు ప్రాణాలు అర్పంచారని ఆయన అన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. పతాక దినోత్సవం సందర్బంగా పౌరులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సంస్ధలు ఉదారంగా విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేసారు. విరాళాలను డైరక్టర్ , సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు లేదా డ్రాప్టు రూపంలో అందించవచ్చని ఆయన వివరించారు.  ఆయా చెక్కులను శ్రీకాకుళం పెదరెల్లి వీధిలోగల జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో అందించవచ్చని ఆయన తెలిపారు. ఎన్.సి.సి విద్యార్ధులు మేము సైతం అంటూ విరాళాలు సేకరించడం జరుగుతుందని, వారికి సహకరించి సైనికుల సంక్షేమానికి తోడ్పడాలని ఆయన కోరారు. పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని సత్యానందం పేర్కొన్నారు.