పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు..
Ens Balu
2
Machilipatnam
2020-12-05 14:39:33
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా చేయాలని ఆదేశించారని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం వరకు 5 రోజులు పాటు పాల్గొని శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత బందరు మండలంలో ఒక గ్రామానికి చెందిన 30 మంది మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యను చెప్పుకొన్నారు. తమ గ్రామంలో గత 8 ఏళ్లుగా ఒక ఉపాధ్యాయురాలు ఎంతో ఆదర్శవంతంగా విధులు నిర్వహిస్తూ బాల బాలికలకు ఉత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తూ, గ్రామాన్ని ఎంతో చైతన్యపరుస్తున్నారని ఆమెను తమ గ్రామంలోనే తిరిగి ఉద్యోగం చేసేలా ఆ బదిలీను మీరే నిలిపివేయాలని కోరారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బదిలీలు , ఉద్యోగ విరమణలు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని అంశమని ఆయన తెలియచేస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీ 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం జరుగుతుందన్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే విద్యాశాఖ నిర్వహించనుందని క్షేత్రస్థాయిలో పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ బదిలీ నిర్ణయాలను అధికారులు తీసుకొంటారని ఈ తతంగమంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని గ్రామస్తులకు మంత్రి పేర్ని నాని నచ్చచెప్పారు. కూనపరెడ్డి ఈశ్వరరావు అనే వృద్ధుడు మంత్రిని కలిశారు. జగ్గయ్యపేట ఎన్జీవో కాలనీ లో తనకు ఇంటి స్థలం గతంలో ప్రభుత్వం ఇచ్చిందని , ఆ నివేశన స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని తెలిపారు. తనకు న్యాయం చేయమని కోరారు.
మచిలీపట్నంలోని దేశాయిపేటకు చెందిన ఒక మహిళ తన కష్టాన్ని మంత్రికి తెలిపింది. తన భర్త మడమల నాగరాజు అరటిపండ్ల దుకాణంలో చాలా కాలం పనిచేసారని.. అకస్మాత్తుగా ఆయనకు పక్షవాతం రావడంతో ఆరోగ్యం క్షీణించి పనులకు వెళ్లలేకపోవడంతో ప్రస్తుతం అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నామని తమకు ఏదైనా పింఛన్ వచ్చేలా సహాయం చేయమని అభ్యర్ధించింది. ఆమె పరిస్థితికి జాలి పడిన మంత్రి పేర్ని నాని జవాబిస్తూ , అమ్మా , మీకు ప్రభుత్వ పింఛన్ మంజూరు అయ్యేవరకు నేనే వ్యక్తిగతంగా నెలకు 2 వేల రూపాయలను ఇస్తానని ఇప్పటి నుండి ప్రతి నెల తన కార్యాలయంకు వచ్చి తన కార్యదర్శి తేజ నుంచి ఆ మొత్తాన్ని తీసుకువెళ్లవచ్చని ఆ మహిళకు చెప్పారు.
విజయవాడకు చెందిన ఒక టీవీ ఛానల్ ఉద్యోగులు కొంతమంది మంత్రి పేర్ని నానికు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ యాజమాన్యం గత కొంతకాలంగా వేతనాలు ఇవ్వడం లేదని దీంతో పలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు.