సైంటిఫిక్ అసిస్టెంట్ పరీక్షకు పక్కా ఏర్పాట్లు..
Ens Balu
2
Kurnool
2020-12-05 15:19:03
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండడంతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు అన్నారు. ఈ సంధర్బంగా శనివారం కళాశాలల యాజమాన్యం, పరీక్షలు నిర్వహించే కళాశాల ప్రిన్సిపాల్స్, పోలీసు అధికారులతో ఎస్పీ కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల వద్ద ఏలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.. పరీక్ష కేంద్రాల వద్ద సిసి టివిల కెమెరాల నిఘా పకడ్బందీగా ఉండాలన్నారు. సిసి టివిల విడియో స్టోరేజి కూడా ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న లాడ్జీలు, అపార్ట్ మెంట్ లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆదివారం పరీక్ష సమయం ఉదయం 11 నుండి 1 గంట వరకు ఉంటుందన్నారు. కర్నూలుతో పాటు తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ లలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
రాయలసీమ జోన్ లో కర్నూలు, తిరుపతి లలో మొత్తం 4 సెంటర్లు, కర్నూలులో 2 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు , ఇంటర్నెట్ సెంటర్లను, హోటల్స్ , ఇతర షాపులను మూసి వేయించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్ళే ప్రతి అభ్యర్దికి కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రానికి అనుమతించాలన్నారు.
పరీక్ష రోజున ఒక గంట ముందే కేవలం హాల్ టికెట్ తో పరీక్ష కేంద్రానికి అభ్యర్దులు చేరుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్ధులు ఫేస్ మాస్కులు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. పరీక్ష కేంద్రానికి పెన్నులు, సెల్ ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదన్నారు. పెన్నులను ప్రతి ఒక్కరికి పరీక్ష కేంద్రంలోనే ఇస్తారన్నారు.
పరీక్ష రాసే అభ్యర్దులకు బయోమెట్రిక్, మ్యానువల్ ఫింగర్ ప్రింట్ సేకరణ ఉంటుందన్నారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్( కో ఆర్డినేటర్) శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డిఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్ బాబు కె.వి మహేష్ , రామాంజి నాయక్, సిఐలు ఓబులేషు, శ్రీనాథ్ రెడ్డి , శివశంకరయ్య, ఈ కాప్స్ ఇంచార్జ్ రాఘవరెడ్డి ఉన్నారు.