శీతలీకరణ వ్యవస్థ నిర్వహణే ముఖ్యం వాక్సిన్ కి..
Ens Balu
2
Vizianagaram
2020-12-05 17:05:04
విజయనగరం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటి నుండే చేయాలని జిల్లా కలెక్టర్, కోవిడ్‌పై జిల్లా టాస్కుఫోర్స్ కమిటీ ఛైర్మన్ డా.ఎం.హరిజవహర్ లాల్ వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ, రవాణాలో శీతలీకరణ వ్యవస్థ నిర్వహణే ముఖ్యమని, దీనిపై అధికంగా శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటి నుండే వ్యాక్సిన్‌ను నిల్వచేసే ప్రదేశాలను గుర్తించడం, రవాణా సందర్భంగా వ్యాక్సిన్‌కు అవసరమైన స్థాయిలో శీతల వ్యవస్థ వుండేలా ఆయా వాహనాల్లో ఏర్పాట్లు చేయడం ముఖ్యమని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా టాస్కు ఫోర్సు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలస్థాయి టాస్కుఫోర్సు సమావేశాలు తహశీల్దార్‌ల అధ్యక్షతన నిర్వహించి ఆ సమావేశపు నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. కోవిడ్‌ను 48 రోజులపాటు నిలువరించి గ్రీన్‌జోన్‌లో నిలిచిన జిల్లాగా మన జిల్లాకు ప్రత్యేక స్థానం వున్నదని, రెండో వేవ్‌లో కూడా కేసులు లేకుండా, ఒక్క మరణం కూడా సంభవించకుండా నిరోదించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల సిబ్బందిలో కోవిడ్ సోకకుండా చేపట్టాల్సిన పదిహేను అంశాలపై కనీస స్థాయి పరిజ్ఞానం వుండేలా చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్క ఉద్యోగి కరోనా వారియర్‌లా సిద్ధం చేయాలన్నారు. వ్యక్తుల నుండి ఆరడుగుల భౌతికదూరం వుండేలా చూడటం, మాస్కు తప్పనిసరిగా ధరించడం, రోజంతా పలుమార్లు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌లతో శుభ్రం చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించేలా అన్ని వర్గాల ప్రజానీకంలో అవగాహన కలిగించాల్సి వుందన్నారు.
జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ చేపడుతున్న కారణంగా సాధారణంగా వేసే వ్యాధినిరోధక టీకాలకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాల్సి వుందన్నారు. వ్యాక్సిన్ కోసం పలువర్గాల నుండి వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి అధికంగా వుంటుందని, అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తలు చేపట్టాల్సి వుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, అవసరమైన వారికి అందించడానికి పకడ్బందీ వ్యూహం ఏర్పరచుకోవలసి వుందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఓ.) ప్రతినిధి డా.భవాని మాట్లాడుతూ ఈనెల 22న వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పై జిల్లా స్థాయి రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. యునిసెఫ్ ప్రతినిధి శివ కిషోర్ మాట్లాడుతూ కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రస్తుతం వున్న శీతలీకరణ వ్యవస్థ ఏర్పాట్లు, నిల్వ సదుపాయాలు, వ్యాక్సిన్ సరఫరాకు అందుబాటులో వున్నవాహనాలు తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి వివరించారు. జిల్లాలో 90 కోల్డ్ చెయిన్ పాయింట్లు, 231 నిల్వ పరికరాలు, 3909 మంది వ్యాక్సినేషన్ చేపట్టే ఎ.ఎన్.ఎం.లు ప్రస్తుతం అందుబాటులో వున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ రవాణాకు మరో రెండు ప్రత్యేక వాహనాలకోసం, మరికొన్ని అదనపు నిల్వ పరికరాల సరఫరాకోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలసి మొత్తం 15వేల ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో వున్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో శిక్షణ పొందిన కార్యకర్తలు 3,909 మంది మాత్రమే వున్నట్టు వివరించారు.
జిల్లాలో వివిద ప్రభుత్వ శాఖల ద్వారా వ్యాక్సినేషన్‌ను ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమో గుర్తించి తెలియజేస్తే ఆ మేరకు ఆయా శాఖల సిబ్బందిని ఈ కార్యక్రమానికి వినియోగించే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.బాలమురళీకృష్ణ, జిల్లా అదనపు వైద్యాధికారి డా.రవికుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.