పారిశుధ్య పక్షోత్సవాలు విజయవంతం కావాలి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-12-05 17:20:59
ప‌్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ జిల్లాలో డిశంబరు 7 నుండి 21 వరకు నిర్వహించే పారిశుద్ధ్య పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ప్రజలు భాగస్వాములైతేనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని, అందువల్ల ఈ పారిశుద్ధ్య పక్షోత్సవాలకు మండలంలో ఎంపిక చేసిన పది గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచి ఆయా గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. మండల ప్రత్యేకాధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో మనం-మన పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆరోగ్యంగా మన విజయనగరం అనే నినాదంతో మన జిల్లాలో కార్యక్రమాలు ఎప్పటినుండో చేపడుతున్నామని, దీనికి కొనసాగింపుగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ కింద ఇప్పటికే వాష్ అనే కార్యక్రమాలు చేపడుతున్నామని వీటి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, వ్యర్ధాల నిర్వహణ, డ్రెయిన్ల నిర్వహణ, చేతులు పరిశుభ్రంగా వుంచుకోవడం, సబ్బుతో చేతులను కడగటం వంటి అంశాలపై ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో తడి చెత్త, పొడిచెత్త విడిగా సేకరించడం వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మారాలన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలు తొలగించడం, డ్రెయిన్లలో పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పక్షోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్దకు వెళ్లి దాని పనితీరును ప్రతిఒక్కరికీ తెలియజేయాలన్నారు. 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఆయా మండలాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. 10వ తేదీ నుండి 21 వరకు గ్రామస్థాయిలో రైతులు, మహిళలు, విద్యార్ధులు, వ్యాపారుల తదితర వివిధ వర్గాల ప్రజలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈనెల 21న పక్షోత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకుల నిర్వహించి ఈ పక్షోత్సవాల్లో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామ ప్రజలకు వివరించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులంతా 7వ తేదీ నుండి జరిగే పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో తమకు కేటాయించిన మండలాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
7న జిల్లా కేంద్రంలో పక్షోత్సవాల ప్రారంభ ర్యాలీ
వ్యర్ధాలపై యుద్ధం పేరుతో చేపడుతున్న పక్షోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈనెల 7వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుండి అయ్యకోనేరు వరకు ర్యాలీ చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొంటారని, అనంతరం అయ్యకోనేరు వద్ద ప్రారంభిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలపై రూపొందించిన ప్రచార సామాగ్రి, కరపత్రాలు, పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, ఐటిడిఏ పి.ఓ. ఆర్.కూర్మనాథ్, జిల్లా పంచాయతీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు.