నీరుంటే క్షేమం..లేకుంటే క్షామం
Ens Balu
2
Vizianagaram
2020-12-05 17:57:42
నీరే జీవనాధారమని, నీరున్న ప్రదేశాలు మాత్రమే క్షేమంగా ఉంటాయని భావించి, జిల్లాలో జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. జాతీయ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వాననీటి పరిరక్షణపైన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం జాతీయస్థాయి వెబ్‌నార్ జరిగింది. ఈ వెబ్ నార్‌లో జలశక్తి శాఖ కార్యదర్శి యుపి సింగ్ కీలకోపన్యాసం చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షపునీటి సంరక్షించి, భూగర్భజలాలను పెంచడానికి, చెరువుల శుద్ది కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ద్వారా అదనంగా 20.9 టిఎంసిల నీటిని రీఛార్జి చేయడం జరిగిందని, తద్వారా భూగర్భజల మట్టం 1.9 మీటర్లు మేరకు పెంచడం జరిగిందని వివరించారు. జిల్లాలో 9,346 చెరువులకు గానూ, ఇప్పటివరకు సుమారు 300కుపైగా చెరువులను శుద్దిచేయడం జరిగిందని తెలిపారు.
శుద్దిచేసిన చెరువుల ద్వారా భూగర్భజలాలను పెంచడమే కాకుండా, పశువులు, జీవాలకు నీటి కొరత లేకుండా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గతేడాది త్రాగునీటి సమస్య కూడా తలెత్తకుండా చేయగలిగామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు కూడా దోహదపడిందని చెప్పారు. జిల్లాలో జరిగిన చెరువుల శుద్ది కార్యక్రమాన్ని గుర్తించి, ఇటీవలే జల సంరక్షణలో జాతీయ అవార్డును గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల ఆద్వర్యంలో కోటి, 14లక్షల మొక్కలను పెంచి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే నిలిచామన్నారు. ఫలితంగా జిల్లాలో పచ్చదనాన్ని 16.9 శాతం నుంచి 17.9 శాతానికి పెంచడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛం సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యంతో మొక్కల పెంపకాన్ని జిల్లాలో ఒక ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తూ, హరిత విజయనగరం స్థాపనే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతోందని వివరించారు. పచ్చదనాన్ని పెంచడానికి, చెరువుల శుద్దికి, పారిశుధ్యానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించడంలొ భాగంగా, తానే స్వయంగా మూడు పాటపాడి, ప్రజల్ని చైతన్యవంతులను చేసినట్లు కలెక్టర్ తెలిపారు.