ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-12-05 18:34:21
తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేలా రైతులకు సహాయసహకారాలు అధికారులు అందించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. మరో ఏడు రోజులు కీలకమైనవని, ఈ సమయంలో క్షేత్రస్థాయిలో అందుబాటులోఉండి దెబ్బతిన్న, రంగుమారిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చూడాలని వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్‌స్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. తమ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు జరగలేదంటూ ఏ ఒక్క రైతు నుంచి ఫిర్యాదు రాకుండా చూడాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు సహాయకుడు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూం (08886613611)కు అనుసంధానంగా 21 బృందాలు ఏర్పాటుచేశామని.. ప్రతి 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒక బృందం సమన్వయం చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో బృందం తరఫున కంట్రోల్ రూం నుంచి టెక్నికల్ అసిస్టెంట్, క్షేత్రస్థాయి నుంచి మండల వ్యవసాయ అధికారి సేవలందిస్తున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాకు మంచి పేరుందని, దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లయ్‌స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాద్‌బాబు, డీడీఏ ఎస్.మాధవరావు, మార్కెటింగ్ ఏడీ కేవీఆర్ఎన్ కిశోర్, రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.