సకల సదుపాయలతో లేవుట్లు సిద్దం..
Ens Balu
4
Anantapur
2020-12-05 18:39:26
అనంతపురం జిల్లాలో అన్ని సదుపాయాలతో లేఔట్ లను సిద్ధం చేసి ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు అందించనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవన్ లో సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో ఇళ్ళ పట్టాల పంపిణిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,10,000 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలలో 28,30,000 ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వనుందన్నారు. అందులో మొదటి విడతలో 15,10,000 మందికి, రెండవ విడతలో 13,20,000 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందివ్వడమే కాకుండా ఇళ్ళ నిర్మాణాలను కూడా చేపడుతుందన్నారు.
దేశ వ్యాప్తంగా 5 సంవత్సరాల కాలంలో 60 లక్షల ఇళ్ళను నిర్మించారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే సుమారు 30 లక్షల ఇళ్ళను నిర్మించడం ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలో 2,03,199 మందికి ఇళ్ళ పట్టాలను పంపిణి చేయనున్నామన్నారు. ఇందులో 1,11,099 మంది లబ్దిదారులకు గృహ నిర్మాణాలకు కూడా మంజూరు ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ,ప్రతి ఒక్క లబ్దిదారునికి 340 చ.అ.ల ఇంటి పట్టాని అందించి, అందులో 272 చ.అ.లో ఇంటిని నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందులో లివింగ్ రూమ్, కిచెన్, బాత్ రూమ్, టాయిలెట్ లు ఉంటాయన్నారు. మొదటి విడతలో పట్టణ ప్రాంత లబ్దిదారులకు మరియు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని మండలాలలోని లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించడం జరుగుతుందన్నారు. రెండవ విడతలో గ్రామీణ ప్రాంత లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.