ఇసుక ఉచితం.. రవాణా చార్జీలే చెల్లించాలి..


Ens Balu
2
Anantapur
2020-12-05 19:02:57

అనంతపురం జిల్లాలో ప్రతి ఇంటిని రూ.1,80,000/-ల ఖర్చుతో నిర్మించనున్నట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు.  ఆ ఇళ్ల కు దగ్గరగా ఉన్న ఇసుక రీచ్, స్టాక్ యార్డ్, డిపోల నుండి ఇసుక  రవాణా చార్జీలు మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి సైతం జిల్లా స్థాయిలో సేకరించి లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు.  ప్రతి ఇంటి నిర్మాణానికి 92 సిమెంట్ బస్తాలు అవసరమన్నారు.  ఒక సిమెంట్ బస్తా ధర మార్కెట్ లో రూ.390/-లు ఉంటే గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.235/-లకే ప్రభుత్వం అందిస్తోందన్నారు. లేఔట్ లు రూపొందించిన ప్రాంతాల్లో విద్యుత్, నీటి సౌకర్యం, బోర్లు వేయడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు.   ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,240 కోట్లతో పనులను చేపట్టేందుకు నిధులను మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో   పట్టణ ప్రాంతంలో 44,945 ఇళ్ళు , అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని  మండలాలలోని లబ్దిదారులకు 66,154 ఇళ్ళు నిర్మించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 988 లేఔట్ లలో 509 కి.మీ.ల అంతర్గత రహదారులను, 58 కి.మీ.ల అప్ రోచ్ రోడ్లను నిర్మించామన్నారు.  లేఔట్ లలో 9 మీటర్లు, 6 మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామన్నారు.  9 మీటర్ల రహదారి నిర్మాణంలో 6 మీటర్ల వెడల్పుతో రోడ్డును,  ఆ రోడ్డుకు ఇరువైపులా 1.50 మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు.  అలాగే 6 మీటర్ల రహదారి నిర్మాణంలో 4 మీటర్ల వెడల్పుతో రోడ్డును,  ఆ రోడ్డుకు ఇరువైపులా ఒక మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు.   రోడ్లను 6 ఇంచుల మందంతో నిర్మిస్తున్నామన్నారు.  లబ్దిదారులందరికి సౌకర్యవంతంగా ఉండేలా లేఔట్ నిర్మాణాలను అత్యంత నాణ్యత, పచ్చదనం, అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  988 లేఔట్ లలో రహదారులకు ఇరువైపులా మరియు ఖాళీ ప్రదేశాలలో 1,20,000 మొక్కలను నాటడంతోపాటు ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.