“వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం”లో భాగస్వామ్యం కావాలి..


Ens Balu
6
East Godavari
2020-12-05 19:39:34

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకూ నిర్వహించనున్న  “వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం”  పక్షోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.  పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గం.లకు జడ్పి మీటింగ్ హాలులో జరిగే సమావేశంలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం మద్యాహ్నం 11-50 గం.లకు జడ్పి కార్యాలయ కూడలి నుండి మెయిన్ రోడ్ వరకూ వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంటు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు.  ఇదే తరహా కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన మండల స్థాయిలోను, 9వ తేదీన గ్రామపంచాయితీ స్థాయిలోను నిర్వహించి,  10 నుండి 21వ తేదీ వరకూ గ్రామ పంచాయితీ స్థాయి ఫంక్షనరీలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, దుకాణదారులు, కూరగాయల వ్యాపారులు, గ్రామీణ వృత్తికారులు, పారిశుద్య సిబ్బంది, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఆవాసాలలో పారిశుద్య ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  అన్ని రంగాల ప్రజలు  వ్యర్థాల పై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.