"వ్యర్థం పై యుద్ధం" లో భాగస్వాములు కండి..
Ens Balu
3
జిల్లా పరిషత్
2020-12-05 19:46:39
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "వ్యర్థం పై యుద్ధం" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) నాగార్జున సాగర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం అమలు, నిర్వహణపై ఆయన, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి తో కలిసి పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో "మనం మన పరిశుభ్రత కార్యక్రమం" (ఎం.ఎం.పి.ఎస్) రెండవ దశలో భాగంగా జిల్లా లోని 35 మండలాల్లో ఎంపిక చేసిన 153 గ్రామ పంచాయతీలను ఒ.డిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా 15 రోజుల పాటు (7-12-2020 నుంచి 21-12-2020 వరకు) పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో పారిశుద్ధ్యం పై సంపూర్ణ అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు.
ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో " వ్యర్థం పై యుద్ధం" చేసేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి వ్యవస్థ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారులు, అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. సంబందిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు ఎం.పి.డి.వో.లు, తమ పరిధిలోని గ్రామీణ స్థాయి సిబ్బంది చేత పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగు పరచడం పై ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావాలన్నారు.
* జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 7న పక్షోత్సవాల పై వర్కుషాపు, ర్యాలీ
"మనం - మన పరిశుభ్రత" పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా. ఈ నెల 7వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో వర్కుషాపు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని అనుబంధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జెడ్పి సీ.ఈ.ఓ పేర్కొన్నారు. 8వ తేదిన మండల స్థాయిలో, ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో సమావేశం జరిపి ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 9వ తేదీన గ్రామ పంచాయతీ స్థాయిలో సమావేశం మరియు ర్యాలీ జరుపుతారని అన్నారు. 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గ్రామ పంచాయతీలను వ్యర్థ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ ఈ.నాగలక్ష్మి పాల్గొన్నారు.