అసైన్డ్ భూములకు చివరి ప్రాధాన్యత..
Ens Balu
3
Anantapur
2020-12-05 19:50:25
అనంతపురం జిల్లాలో ఇళ్ళ పట్టాల పంపిణికి చేపట్టనున్న భూసేకరణలో అసైన్డ్ భూములకు చివరి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవన్ లో సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో ఇళ్ళ పట్టాల పంపిణి, భూసేకరణ, కోర్ట్ కేసులు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా 2,03,199 ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు అందించనున్నామన్నారు. భూసేకరణకు సంబంధించి తొలుత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేటు భూములను సేకరించాలన్నారు. ఈ రెండూ లేని ప్రాంతాల్లో మాత్రమే చివరి ప్రాధాన్యతగా అసైన్డ్ భూములను సేకరించాలన్నారు.
సబ్ కలెక్టర్, జిల్లాలోని ఆర్.డి.ఓ.లు భూసేకరణ ప్రతిపాదనలను వెంటనే పంపాలన్నారు. అట్టి ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే ఆ లేఔట్ లలో భూమి చదును, రాళ్ళను పాతడం, అంతర్గత రహదారులు, సర్వే పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేఔట్ లలో భూముల కేటాయింపుకు సంబంధించి ఎన్ని రాళ్ళు కావాలో ముందుగానే లెక్కించి సరఫరా చేసేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల మంజూరులో భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో 187 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ కేసులు వేసిన వారితో సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు మాట్లాడి కేసులను విత్ డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ కేసుల్లో కోర్టులు జారీ చేసిన ఇంటరిమ్ ఆర్డర్లకు సంబంధించి కౌంటర్ లను వెంటనే వేయాల్సిందిగా భూసేకరణ నోడల్ అధికారి వరప్రసాద్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై కోర్ట్ లో ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లైసన్ ఆఫీసర్ త్రిమూర్తులును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు జిపి ద్వారా కోర్టుకు సమర్పించిన కేసులు, జిపిచే ఆమోదించిన కేసులు, ఆమోదించాల్సిన కేసుల వివరాలను క్రోడీకరించి నివేదికను తనకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆ నివేదికను పరిశీలించిన పిమ్మట ఏజితో తాను మాట్లాడడం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు 350 లేఔట్ లలో నిర్మించిన అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయని ఎంపిడిఓలు, ఏపిఓలు నివేదికలు పంపారన్నారు. ఆ నివేకలలోని లేఔట్ లను సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు 2 రోజుల్లోపు మరొకమారు పరిశీలించి వాస్తవాలను నివేదించాలన్నారు. అందుకు సంబంధించి మరమ్మతులు చేపట్టి వాటి డ్రోన్ ఫోటోలు, వీడియోలను తనకు పంపాలన్నారు. లేఔట్ లలో ఎండిన మొక్కల స్థానంలో వెంటనే మొక్కలను నాటాలన్నారు.
ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు తమ పరిధిలోని లేఔట్లన్నింటినీ పరిశీలించి పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారుల ఎంపిక నుండి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించే ప్రక్రియ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ముందుగా లాగిన్ సౌకర్యం పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులలో ఇంజనీరింగ్ అసిస్టెంట్/వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్/వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, విలేజ్/వార్డ్ వాలంటీర్లకు నిర్దేశించిన బాధతలను తు.చ. తప్పక పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.