ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక కృషి..


Ens Balu
1
Vizianagaram
2020-12-05 19:53:58

విజయనగరం జిల్లాలోని ఎస్సీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమృద్ధిగా వినియోగించి ఎస్సీల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలు తీసుకున్న చర్యల పై, అమలు చేసిన విధానాలపై సమీక్షించారు.    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కేటగిరీలో ఉన్న అని ఉప కులాలను అభివృధి పథంలోకి తీసుకురావాలని, తగిన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పథకాలూ వారికి అందేలా భాధ్యత వహించాలని పేర్కొన్నారు. వారంతా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఉపయోగకరమైన పనులను ప్రవేశ పెట్టడం ద్వారా ఉప ప్రణాళికా లక్ష్యాలను సాధించాలని సూచించారు. వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఎస్సీలకు అవకాశాలను కల్పించటం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని హితవు పలికారు. ఎస్సీ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని, ఉన్నతి, చేయూత, ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్సీలకు ఆర్థిక ఫలాలను అందజేయాలని చెప్పారు. డి.ఆర్.డి.ఎ., డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, మేప్మా, విద్య, హార్టికల్చర్, సెరికల్చర్, ఇతర శాఖలు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. ఎస్సీల ఆర్థిక అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకోవాలని సూచించారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, వారి కాలనీల్లో రోడ్లు వేయాలని, విద్యుత్తు సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ నుంచి వచ్చే ప్రతీ సేవా వారికి తప్పకుండా అందాలని, దీనిలో ప్రతీ శాఖ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.                 సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి. జగన్నాథం, డి.ఆర్.డి. ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.సుబ్బారావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, డి.ఎం.& హెచ్.వో. పి. రమణ కుమారి, పశు సంవర్ధక శాఖ జేడీ ఏవీ నరసింహులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.