పాలసేకరణ పెంచేందుకు చర్యలు చేపట్టాలి..
Ens Balu
3
తిరుపతి
2020-12-05 20:40:08
ఏపి అమూల్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాలలో పాల సేకరణ పెంచేందుకు సంబంధిత మదనపల్లె, రామసముద్రం ఎంపిడిఓ లు మరియు వారి పరిధిలోని సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ డిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అమూల్ పాల సేకరణ పై మదనపల్లె, రామసముద్రం మండలాల ఎంపిడిఓ లు, వారి పరిధిలోని సచివాలయ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలు పొసే వారికి పాలల్లో ఫ్యాట్, ఎస్ ఎన్ ఎఫ్ ఎలా పెంచుకోవాలనే దాని పై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో రైతులకు ఏ పి అమూల్ ప్రాజెక్ట్ కు పాలు పోసిన యెడల మంచి ధర వస్తుందనే విషయాన్ని పశు సంవర్థ క శాఖ వారు ప్రచురించిన కరపత్రాల ద్వారా అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పాల ఉత్పత్తినీ పెంచేందుకు సహకరించాలన్నారు. అమూల్ ప్రాజెక్ట్ కొరకు చిత్తూరు జిల్లాలో వంద సెంటర్ల ద్వారా పాల సేకరణ జరుగుతూ ఉందని తెలిపారు. ఇంకా ఈ పాల సేకరణ ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పాల సేకరణ బాధ్యతను సంబంధిత ఎంపిడివో లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) వి. వీరబ్రహ్మం, పశు సంవర్థక శాఖ జె డి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.