రైతులకు యూరియా కొరతలేకుండా చూడాలి..మంత్రి


Ens Balu
2
Srikakulam
2020-08-03 14:43:58

రైతాంగానికి యూరియా కొరత రానీయబోమని ఉప ముఖ్య మం త్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాస కృష్ణదాస్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతానికి 10,800 టన్నుల యూరియా నిల్వలు అందు బాటులో ఉన్నాయని అన్నారు. అమరావతి నుంచి ఆయన జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలసి సోమవారం ఉదయం టెలీకాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలో ఎరువుల నిల్వల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు జిల్లాకు యూరియా నిల్వలు రప్పిస్తున్నట్లు ఆ శాఖ జెడి కె.శ్రీధర్ తెలిపారు. నాలుగు మండలాలను ఒక యూనిట్ గా విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లాలో ఆగష్టు నెల నాటికి 18000 టన్నుల యూరియా అవసరం ఉందని, ప్రస్తుతానికి 11698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు వస్తాయని ఈ మేరకు తమ శాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన హామీ లభించిందన్నారు. యూరియా తో పాటు డిఎపి 6400 టన్నులు, ఎంవోపి 2133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3488 టన్నులు, ఎస్ ఎస్ పి 1659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. సీజన్ ఇప్పుడిప్పుడే వేగవంత మవుతున్నదని, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే ఈ ఏడాది నుంచి యూరియా అమ్మకాలు సాగిస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల 50 బస్తాలకు మించి బుక్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇకపై రైతు భరోసా కేంద్రాలు, హబ్ ల ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని జాయింట్ డైరెక్టర్ వివరించారు. రెండు మూడు రోజులకు ఒకమారు జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు వస్తాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కువ మొత్తంలో యూరియాను వేయడం ద్వారా పంటకు కలిగే నష్టాలను వివరించాలని వాటి వాడకాన్ని నియంత్రించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.