మంచి చదువుతో ఉత్తమ భవిష్యత్తు..
Ens Balu
2
Vizianagaram
2020-12-06 16:42:14
చదువుతోనే మంచి భవిష్యత్తు, శాశ్వత ఆనందం లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి అన్నారు. జీవితంలో గెలుపు కావాలంటే ప్రతీ వ్యక్తి, విద్యార్థీ తప్పకుండా పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించిన "చదవడం మాకిష్టం" కార్యక్రమం స్థానిక గురజాడ స్మారక కేంద్ర జిల్లా గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈవో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా "చదవడం మాకిష్టం" పేరుతో ఉన్న ప్రచార పత్రాన్ని, బ్రోచేర్ని ఆవిష్కరించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ మంచి భవిష్యత్తు, ఆనందకరమైన జీవితం కావాలంటే విద్యార్థి దశలోనే కష్టపడాలని సూచించారు. పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని, దాని ద్వారా మనోవికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థీ సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. దీని అమలులో ప్రతి ఉపాధ్యాయుడు భాద్యతగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. మండల కేంద్రాల్లో గ్రంథాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతాల్లో రీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. మహనీయుల జీవిత చరిత్రలు, కథలు, బాలల సాహిత్యంతో కూడిన అనేక పుస్తకాలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. విద్యార్థులు సినిమాలు, సీరియల్స్, ఫోన్ ప్రభావం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మంచి వేదిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్ధి తల్లిదండ్రులు భాద్యతగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి ఎన్.లలిత, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.తిరుపతి నాయుడు, చదవడం మాకిష్టం ప్రాజెక్ట్ కో - ఆర్డినేటర్ నాగవల్లి, ఏ.ఎం.వో. బి.అప్పారావు, బాల సాహిత్యం కో - ఆర్డినేటర్, తెలుగు పండిట్ జి.ఎస్.చలం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువు ఆవశ్యకతను, పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.