విరమణ ఉద్యోగానికే..సేవలకు కాదు..


Ens Balu
2
Srikakulam
2020-12-06 17:33:58

ఉద్యోగ విరమణ చేయడం ఆ స్థానానికి మాత్రమేనని, సేవలకు కాదని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఒక వ్యక్తి ఓపిక, సహనం మేరకు సామాజిక సేవ ఏ వయస్సు వరకైనా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ గా, జిల్లా ఐటిఐల కన్వీనర్ గా పనిచేసి నవంబరు 30న పదవీ విరమణ చేసిన రాడా కైలాసరావుకు అభినందన సభ ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మాన ప్రసాద రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాడా కైలాసరావు దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సమాజ సేవ చేయుటకు వయస్సు అడ్డంకి కాదన్నారు. సమాజంలో ఇంకా అనేక రంగాల్లో మంచి సేవలు అందాల్సిన పరిస్ధితులు ఉన్నాయని వాటిలో నచ్చిన రంగాన్ని ఎన్నుకుని సేవలు అందించుటకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పదవీ విరమణ చేసిన అనంతరం జీవితం సమాప్తం అయిందనే ఆలోచనకు చాలా మంది వస్తుంటారని, అది సరికాదని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కొన్ని బాధ్యతల నుండి మాత్రమే తప్పుకోవడం జరుగుతుందని, అనంతరం స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చని సూచించారు. కైలాసరావు విధుల నిర్వహణలో అంకితభావం ప్రదర్శించారని, విద్యార్ధులను తీర్చిదిద్దడంలోను, ఐటిఐలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను చొరవ చూపించారని ప్రశంసించారు. విధులు అంకితభావంతో నిర్వహిస్తే మంచి సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమాజ హితానికి, అయా శాఖలు అందించే సేవలను మనస్ఫూర్తిగా అందించి ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలవాలని అన్నారు. కైలాస రావు విధుల నిర్వహణలో ఉంటూ సమాజ హితం గూర్చి ఆలోచించిన వ్యక్తి అన్నారు. తన భౌతిక కాయాన్ని మరణానంతరం వైద్య పరిశోధనలకు దానం చేసిన వ్యక్తి అన్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరమని కొనియాడారు.           ఐటిఐల ప్రాంతీయ ఉప సంచాలకులు ఆర్.వి.రమణ మాట్లాడుతూ కైలాస రావు మంచి సేవలు అందించారన్నారు. ఐటిఐలు అభివృద్ధి కావాలనే తపనతో సేవలు అందించారని పేర్కొన్నారు. సహృదయులని, అందిరితో ప్రేమ పూర్వకంగా ఉంటారని ఆయన అన్నారు. పనిలో పెండింగు సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు.           వంశధార పర్యవేక్షక ఇంజనీరు డోలా తిరుమల రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు ఎస్.వి.రమణ, ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు డా.కె.సుధీర్, ఏపిఐడిసి మాజీ డైరక్టర్ మొదలవలస రమేష్ మాట్లాడుతూ  కైలాస రావు సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి గులోన వ్యాఖ్యతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, ప్రైవేటు ఐటిఐల రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టి నాగభూషణం, సుదర్శన రావు, ఎస్.కె.నాయుడు, వావిలాపల్లి జగన్నాథం నాయుడు, ఎస్.జోగినాయుడు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ ఐటిఐల శిక్షణాధికారులు, సిబ్బంది, కైలాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.