ఆ 3 గ్రామాల్లో నిత్యాన్నదానం ప్రారంభం..
Ens Balu
3
వేడంగి
2020-12-06 18:33:13
ఆదరణలేక, శరీరాలు సహకరించక, దుర్భర స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు ఉన్న చోటుకే భోజనం అందించే సేవా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విశ్వమానవవేదిక అధ్యక్షులు మల్లుల సురేష్ తెలిపారు. వేడంగి, వేడంగి పాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో సంస్థ సభ్యులు భోజనాలు పంపిణీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షలు మాట్లాడుతూ, 2015 నవంబర్ 17న పాలకొల్లు ప్రాంతంలో ప్రారంభించిన విశ్వమానవవేదిక నిత్యాన్నదానం నిరాటంకంగా ఎంతోమంది అభాగ్యుల ఆకలి తీరుస్తుందన్నారు. 1846 రోజులగా ఆదరణలేని వృద్ధులు ఇళ్లకే భోజనాలు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని పోడూరు మండలం వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాలకు విస్తరించడం సంతోషదాయకమన్నారు. అనేక ఒడిదుడుకులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని అకుంఠిత దీక్షతో అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదానాన్ని ముందుకు నడిపిస్తున్న టీమ్ లీడర్ విశ్వమానవ వేదిక శ్యామ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాల పరిధిలో ఆకలితో భోజనం లేక అల్లాడుతున్నవారు ఎవరైనా ఉంటే 9652256999, 9441447084, 08814226399 ఫోన్ నంబర్లకి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండేటి రవి, పైలా చిన్నా, విశ్వమానవవేదిక శ్యామ్, డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వరి, వేండ్ర శ్రీనివాస్, యర్రంశెట్టి జయరాజు తదితరులు పాల్గొన్నారు.