రేపు ఏలూరుకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి..
Ens Balu
2
Eluru
2020-12-06 19:29:56
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన రోగులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం స్వయంగా పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి ఉదయం 10:20 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమవుతారు. ఏలూరులో సుమారు 200 మంది అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో కూడా వారికి ఏ విధమైన వ్యాధి వచ్చిందో నేటికి నిర్ధారణ కాకపోవడంపైనా వైద్యాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నవారికి ఏ తరహా వైద్య పరీక్షలు చేస్తారనే విషయమై రేపు సీఎం నేరుగా వైద్యాధికారులతో మాట్లాడి దిశా నిర్ధేశం చేయనన్నారు.