ప్రజా చైతన్యంతోనే సంపూర్ణ పారిశుధ్ధ్యం


Ens Balu
3
Srikakulam
2020-12-07 14:31:09

ప్రజా చైతన్యంతోనే సంపూర్ణ పారిశుధ్ధ్యం సాధ్యపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు పేర్కొన్నారు.  సోమవారం మనం - మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగింది.  కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు ముఖ్య అతిధిగా విచ్చేసారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు.  గ్రామాలు, పట్టణాలు సంపూర్ణ పారిశుధ్ధ్యంతో విలసిల్లాలని, ఇందుకు గాను ప్రజల ఆలోచనలు మారాలని, అలవాట్లు మారాలని వారిలో  చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఇందుకు చిత్తశుద్ధి, అమలుపట్ల సన్నద్ధత అవసరమని తెలిపారు. గ్రామాలలో సానిటేషన్  కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి పారిశుధ్ధ్యంపై వారికి అవగాహన కలిగించాలన్నారు.  పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్రాసెసింగ్ కేంద్రాలలో నిర్మాణం పూర్తి చేయాలని, ఉపాధి హామీ పథకం క్రింద కూడా దీని నిర్మాణానికి అనుసంధానం చేయవచ్చునని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.  మార్చి అనంతరం పంచాయతీ లకు అధిక మొత్తంలో నిధులు రానున్నాయని తెలిపారు.                         జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ భవిష్యతరాల గూర్చి ముందుచూపు ఉండాలన్నారు. మంచి ప్రణాళికలతో అమలు చేస్తే విజయం తధ్యమని, ఓడిఎఫ్, తడి చెత్త - పొడి చెత్త, కాలువలు నిర్వహణ, తాగునీరు కల్పన ప్రధానమైన అంశాలని తెలిపారు.  835 సచివాలయాల్లో కూడా ఓడిఎఫ్ పాటించాలన్నారు.  పంచాయితీ సెక్రటరీలు, వాలంటీర్లు టాయ్ లెట్లు వున్న ఇళ్ళు, టాయ్ లెట్లు వుండి వాటిని వినియోగించుకోని వారిని గుర్తించడం చేయాలన్నారు.   ప్రజలకు బహిరంగ మల విసర్జనపై అవగాహన కలిగించు నిమిత్తం ఆ యా ప్రదేశాలకు వారిని తీసుకు వెళ్ళి చూపించాలన్నారు.  ఉదయాన్నే గ్రామంలో సందర్శించడం అవసరమన్నారు.  సాలిడ్ వేస్ట్ ప్రోసెసిగ్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు.  మరమ్మత్తులు వుంటే వాటిని చేయించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్ ల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.  మురుగునీటి కాలువలను శుభ్రపరచాలని, సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. మంచి నీటి బావులు, ట్యాంకులలో క్లోరినేషన్ చేయాలని తెలిపారు.  ఐ.ఇ.సి. కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని తెలిపారు.  స్వయం శక్తి సంఘాలు, ఉపాధి హామీ సిబ్బంది క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు  ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.    జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంను మొదటి దశలో 76 పంచాయతీలలో చేపట్టామని అన్నారు. రెండవ దశలో 353 పంచాయతీలలో అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయుటకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందని నిర్ధారించుకోవాలని అన్నారు. కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించేలా చైతన్య పరచాలన్నారు. స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంతలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రోడ్ల పై ప్రవహించకుండా చూడాలని ఆయన కోరారు. గ్రామంలో అన్ని విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మరుగుదొడ్లు కలిగి ఉండి వాటిని విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు.  ఆహారం భుజించే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలని ఆయన అన్నారు. గ్రామంలోని అన్ని గృహాలకు సురక్షిత త్రాగునీటి సరఫరా లభ్యత ఉండేలా చూడాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా, ఘన వ్యర్ధ పదార్ధాలను వేరుచేయడం, రీసైక్లింగ్, వర్మి కంపోస్ట్ ప్రాసెసింగ్ మొదలైనవి క్రమం తప్పకుండా  గ్రామంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య వ్యర్ధ పదార్ధాల (LIQUID WASTE MANAGEMENT) నిర్వహణ చేపట్టాలని, గ్రామంలో ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా 500 కంటే ఎక్కువ ఆవులు లేదా గేదెలు వంటి పశువులు ఉన్నప్పుడు, ఆ గ్రామంలో కమ్యునిటీ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తేవడానికి కృషి జరగాలని సూచించారు.  కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన పేరాడ తిలక్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపడి ఆరోగ్యవంతమైన సమాజం నెలకొనుటకు కృషి చేయాలన్నారు.   మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ సందర్భంగా పోస్టర్ ను మంత్రి విడుదల చేశారు. ప్రతిజ్ఞ చేయించారు.  ముందుగా పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి జల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.                         ఈ కార్యక్రమంలో అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి బి.శాంతిశ్రీ, డీపీఓ వి.రవికుమార్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఐసీడీఎస్ పిడి జి.జయదేవి, డిఎంహెచ్ఓ డా.కేసి చంద్ర నాయక్, అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ పి.లక్ష్మీపతి, మెప్మా పిడీ ఎం.కిరణ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.