పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం మన లక్ష్యం
Ens Balu
2
Vizianagaram
2020-12-07 14:42:32
పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం మన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. గంగమ్మతల్లిని గౌరవించే ప్రాంతానికే గౌరవం కూడా దక్కుతుందని ఆయన సూచించారు. పరిసరాలను, ప్రకృతిని పరిరక్షించడానికి ప్రతీఒక్కరూ ముందుకు రావాలని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా, వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షత్సవాలు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా విజయనగరం కోట వద్ద భారీ అవగాహనా ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ప్రారంభించారు. అయ్యకోనేరు వరకూ ర్యాలీ చేసిన అనంతరం, కోనేరు గట్టువద్ద ప్రారంభోత్సవ సభను నిర్వహించారు.
ఈ సభలో కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. వీటి ప్రాధాన్యతను గుర్తించే, డొనేట్ రెడ్, స్రెడ్ గ్రీన్, సేవ్ బ్లూ నినాదాలతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా రక్తదానాన్ని ప్రోత్సహించే చైతన్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు కోటి,20లక్షల మొక్కలను నాటామని చెప్పారు. జల వనరుల సంరక్షణలో భాగంగా జిల్లాలోని వందలాని చెరువులను శుద్దిచేసి, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. నీటిని వృధా చేయకూడదని, గంగమ్మతల్లిని గౌరవించిన ప్రదేశానికి ఎనలేని గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. జల వనరుల సంరక్షణకు జిల్లాలో చేపట్టిన చర్యలకు ఇటీవలే జాతీయ అవార్డు లభించిన విషయాన్ని గుర్తు చేశారు.
విజయనగరం జిల్లాకు గొప్ప భవిష్యత్తు ఉందని, త్వరలో మహానగరంగా అభివృద్ది చెందుతుందని కలెక్టర్ అన్నారు. చారిత్రకంగా, సాంస్కృతికం, క్రీడాపరంగా జిల్లాకు సమున్నత చరిత్ర ఉందని, ఆ స్ఫూర్తిని ప్రతీఒక్కరిలో రగిలించేందుకు పలుచోట్ల సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరి సహకారంతో జిల్లాలో సుమారు రెండు నెలలపాటు కోవిడ్ రాకుండా నియంత్రించగలిగామని చెప్పారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్‌జోన్‌లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయినప్పటికీ కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే, చాలా రకాల వ్యాధులు సోకకుండా నివారించవచ్చని, ప్రతీఒక్కరూ మనసుపెట్టి పనిచేసి, మార్పు తేవడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతీఒక్కరి బాధ్యతని అన్నారు. మన ఆరోగ్యం మెరుగుపడాలంటే, పారిశుధ్యాన్ని, పరిసరాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఏలూరు సంఘటన, ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ, ప్రకృతి వనరుల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. పల్లెల్లో కొనసాగుతున్న బహిరంగ మలవిసర్జన కార్యక్రమాన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్యాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వ్యార్థాలపై యుద్దం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లాకు ఎంతో గౌరవాన్ని తెచ్చారని, గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ వ్యర్థాలపై యుధ్దం పక్షోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యంతో పల్లెలను పరిశుభ్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ రెండున్నరేళ్ల క్రితమే జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పరిశుభ్రత, పచ్చదనం, జలవనరుల సంరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు.
జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి టి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తొలివిడత జిల్లాలో 62 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు గణనీయంగా తగ్గాయన్నారు. దీంతో రెండో దశ క్రింద జిల్లాలో 340 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 7వ తేదీనుంచి 21వ తేదీవరకు 15 రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
విజయనగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ జమ్ము శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యర్థాలపై యుద్దం కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కలెక్టర్ కృషి కారణంగా జిల్లాకు జాతీయస్థాయిలో పేరు దక్కిందని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నిలబెట్టడానికి కృషి చేయాలని అన్నారు. దీనిని నిలబెట్టుకోవాడంలో బాధ్యత మరింత పెరిగిందని ఆయన సూచించారు.
గ్రామీణ నీటిసరఫరా ఎస్ఇ పప్పు రవి మాట్లాడుతూ మంచినీటిని వృధా చేయవద్దని, అవసరమైనంత మేర మాత్రమే నీటిని వాడాలని సూచించారు. ప్రతీఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరారు. కాలువల్లో చెత్తను పడేయడం సాధారణ అలవాటుగా మారిందని, దీనిని విడనాడాలని సూచించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెటగుళ్లు, డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులను అభినందిస్తూ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మెప్మా ఏఓ నగదు బహుమతులిచ్చారు. గ్రీన్ అంబాసిడర్లకు రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, డిపిఆర్ఓ డి.రమేష్, డిపిఆర్‌సి జిల్లా కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, ఎంపిడిఓలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.