సైనికుల త్యాగాలు మరువలేనివి..


Ens Balu
1
Vizianagaram
2020-12-07 14:51:56

విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని సైనికుల సేవలు, త్యాగాలు మరువలేనివి కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సోమవారం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జరిగిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, సైనిక కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికుల సేవలు వెలకట్టలేనివని.. వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సైనికులు, వారు కుటుంబ సభ్యుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి విరాళాలు అందజేయటం ద్వారా వారి రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంకు విశ్రాంత మేనేజర్ పరిటి శంకర సూర్యారావు రూ.1,00,000/-, ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరడ అప్పారావు రూ.25,000/- సైనిక సంక్షేమ నిధికి అందజేశారు. వీరిని కలెక్టర్ శాలువాలు వేసి సత్కరించారు. జిల్లాలో ఉన్న ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, పౌరులు స్పందించి సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, సైనిక సంక్షేమ సంఘం మాజీ సభ్యులు దేవర ఈశ్వరరావు, బొడ్డేపల్లి రామకృష్ణారావు, కూసుమంచి సుబ్బారావు, సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్, మాజీ సైనికులు, సైనిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణారావుకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు  ఇప్పటివరకు 157 సార్లు రక్తదానం చేసిన ఎక్స్ - సార్జెంట్ (ఎయిర్ ఫోర్స్), ఉపాధ్యాయుడు అయిన బొడ్డేపల్లి రామకృష్ణారావును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా వేసి సత్కరించారు. రామకృష్ణారావు ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.