అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలం..
Ens Balu
1
Machilipatnam
2020-12-07 16:55:58
అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి ఇటీవల స్పష్టం చేశరని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) పేర్కొన్నారు. వింత వ్యాధితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు రానున్న నేపథ్యంలో ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని సోమవారం ఉదయం ఏలూరు కు హడావిడిగా ప్రయాణమయ్యారు . ఆ సమయంలో సైతం తన కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలను పలకరించి వారి ఇబ్బందుల గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత తమకు నివేశన స్థలాలు రాలేదని జాబితాలో తమ పేర్లు లేవని కొందరు గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు . ఏ కారణంగా స్థలం ఇవ్వలేదోననే వివరణ సంబంధిత విఆర్వో , రెవిన్యూ ఇన్స్పెక్టర్ , తహసీల్దార్ ఇస్తారని చెబుతూ , ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు . కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలుకానున్నట్లు తెలిపారు. పేదలకు నివేశన స్థలాలు తొలుత ఈ ఏడాది మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నామని . ఆ తర్వాత ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైయస్ఆర్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నామని కానీ, అన్నీ వాయిదా పడ్డాయన్నారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించామని మార్కెట్‌లో వాటి విలువ రూ.23 వేల కోట్లు అని , డిసెంబర్ 25 వ తేదీన మొత్తం 30,68,821 మంది పేదలు ఇళ్లస్థలాలు సంతోషంగా అందుకోనున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇక కొత్త దరఖాస్తుల నేపథ్యంలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందని, డిసెంబరు 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కానున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్తవారి జాబితాలో చేర్చాలని వివరించారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ అధికారులు పూర్తి చేస్తారని. పథకాన్ని అమలు చేసేందుకు ఆరోజున కలెక్టర్లు సిద్ధంగా ఉంటారని మంత్రి పేర్ని నాని చెప్పారు. తన పది చక్రాల లారీకి పన్ను కట్టలేదని 40 వేల 500 రూపాయల జరిమానా తుని ఆర్టీవో విధించారని డిసెంబర్ 31 వ తేదీ వరకు గ్రేస్ పిరియడ్ ఉందని గూడూరు కు చెందిన కె .వెంకటేశ్వరరావు మంత్రికి తెలిపారు. పామర్రు మండలం జమీగొల్వేపల్లి గ్రామానికి చెందిన బాల శ్రీలక్ష్మి తమ కుటుంబం ఎంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని, డిగ్రీ చదివిన తన కుమారుడు బాల షడ్ చక్రవర్తికి ఏదైనా ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలనీ ఆమె మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించింది.