వీర జవానుల కుటుంబాలకు చేయూత..
Ens Balu
2
Srikakulam
2020-12-07 16:58:15
వీర జవానుల కుటుంబాలకు చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపు నిచ్చారు. సోమవారం సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక కుటుంబాలకు, మాజీ సైనిక కుటుంబాలకు సహాయ పడవలసిన ఆవశ్యకత ప్రతీ ఒక్కరి పైన వున్నదన్నారు. సాహసోపేత వీర జవానులకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతను అందించుటకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. భారత సైనిక దళాలు, చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సైనికుల ధైర్య సహాసాలకు, తెగువకు మరో పేరుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఎంతో మంది సైనికులు దేశ రక్షణకు ప్రాణాలు అర్పంచారని ఆయన అన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. పతాక దినోత్సవం సందర్బంగా ప్రతీ ఒక్కరూ ఉదారంగా విరాళాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి.సత్యానందం, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.