సామాజిక బాధ్యతగా వ్యర్ధాలపై యుద్దం చేయాలి..


Ens Balu
2
Gorantla
2020-12-07 17:41:07

వ్యర్థాలతో అనర్థాలు కలుగుతాయని ,వాటిపై పోరాటం చేసి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని,తద్వారా జిల్లాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మాత్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గోరంట్ల మండలకేంద్రం,గోరంట్ల పంచాయతీలో“ వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాలు ” జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు లతో కలిసి మంత్రి పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి పార్వతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి నుండి ఈ నెల21 వ తేదీ వరకు 15 రోజులపాటు వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షోత్సవాలద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించిందన్నారు. ప్రజలంతా సామాజిక బాధ్యతతో మనం- మన పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. మనం వాడిపడేసిన వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి రోగాల బారిన పడరాదన్నారు.మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వ్యర్ధాలను తడి,పొడి చెత్తగా వేరుచేసి చెత్త కుండీలలో వేయాలన్నారు. గ్రామపంచాయతీ, మునిసిపల్ సిబ్బంది ఆ వ్యర్ధాలను చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించాలన్నారు.ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ఆరుబయట  మలవిసర్జనకు స్వస్తి పలకండి :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ఆరుబయట  మలవిసర్జనకు స్వస్తి పలికి మరుగుదొడ్లను వాడాలని  కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ వాటిని ఉపయోగించకుండా ఈనాటికీ చాలామంది  బహిరంగ ప్రదేశాలలో  మల విసర్జన చేయడం జరుగుతోందన్నారు.తద్వారా అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడటమే కాకుండా ,చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అపరిశుభ్రంగా ఉండటం వలన పలురకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఇంట్లోని వ్యర్థాలను తప్పనిసరిగా చెత్త కుండీలలో లోనే వేయాలన్నారు . ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలంతా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ ను వివిధ రూపాలలో వాడి పడేయడం వలన పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ, వ్యర్థాలపై వ్యతిరేక పోరాట కార్యక్రమంలో స్వయం సహాయక బృందాలు, రైతులు, విద్యార్థులు, అధికారులు ,ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు .ప్రతి ఒక్కరూ రోజుకు రెండు రూపాయలు చెల్లించి తడి చెత్త ,పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. డిసిసిబి చైర్మన్ పామిడి వీరాంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలతోపాటు ,ప్రజాప్రతినిధులు, అధికారులందరూ పాల్గొనాలని ఆయన సూచించారు.  కార్యక్రమం ప్రారంభానికి మునుపు మనం- మన పరిశుభ్రత, వ్యర్థాల పై యుద్ధంనకు సంబంధించి ప్లకార్డులను చేతబూని పట్టణంలోని ప్రధాన వీధుల్లో, స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి సభావేదిక వద్దకు వరకు  కర్ణాటక మంగళూరు ప్రాంతం విచిత్ర వేషధారణ కళాకారులు,గురవయ్యలు ,కీలు గుర్రాలు, చెక్కభజన లాంటి కళారూపాలతో నిర్వహించిన ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారుచేసే కేంద్రాన్ని మంత్రి ,ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ లు ప్రారంభించారు .అనంతరం అక్కడే వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ లను వారు పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం మరియు ఆసరా) గంగాధర్ గౌడ్ ,జడ్పీ సీఈఓ శోభా స్వరూపరాణి,  జిల్లా అధికారులు ,మండల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.