ఆరోగ్యం కోసం వ్యర్ధాలపై వ్యతిరేకపోరాటం..


Ens Balu
4
విజయవాడ
2020-12-07 20:47:15

వ్యర్ధాల కారణంగానే అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతోందని, ఇందుకోసం ప్రజలను పరిశుభ్రత పట్ల ఆలోచించేలాగా ప్రజలను చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ పేర్కొన్నారు. స్ధానిక ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో యంపిడివోలు, ఇఓపిఆర్ డిలు, సమన్వయ శాఖల అధికారులతో కార్యశాలను నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణాజిల్లాను పరిశుభ్రతకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్ధాయిలోని సిబ్బందితో కలిసి అడుగులు వేయాలన్నారు. నిన్న ఏలూరులో జరిగిన ఒక గుణపాఠంగా అధికారులు తీసుకోవాల్సి ఉందని, ఈవిషయంపై మంత్రులతో కూడా చర్చించడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లాను పరిశుభ్రత విషయంలో మోడల్ జిల్లాగా రూపుదిద్దడం జరుగుతుందన్నారు. 15 అంశాల ప్రాతిపదికగా చక్కని కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ప్రజలలో భద్రతాభావాన్ని ఒక క్రమపద్ధతిలో తీసుకువెళ్లాలని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అందిస్తారన్నారు. గతంలో పైలెట్ ప్రాజెక్టుగా 118 గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాల రహిత గ్రామపంచాయతీలుగా చక్కని కార్యక్రమాన్ని రూపొందించామని, దీనికి ప్రజల నుండి పెద్ద ఎ త్తున స్పందన వచ్చిందన్నారు. కరోనా పరిస్ధితులలో కొంత ప్రచారాన్ని చేయకపోవడం, కరోనాపై దృష్టిసారించడంలో తిరిగి కొన్ని గ్రామాల్లో యధాస్ధితి వస్తున్నదని, ప్రజలను ఇంటింటి సర్వేద్వారా మరోసారి చైతన్యం చేసే బాధ్యతను యంపిడివోలు సచివాలయ వాలంటీర్ల ద్వారా తీసుకువెళ్లాలని ఇంతియాజ్ స్పష్టం చేసారు. ఈకార్యక్రమంలో భాగంగా పక్షోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టరు యల్. శివశంకర్ మాట్లాడుతూ వ్యర్ధాలపై పోరాటం సమాజ శ్రేయస్సు కోసమేనని ఇందులో ప్రజల వంతు భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. ఇందుకోసం ప్రతీ నెలా నామమాత్రపు రుసుం చెల్లించేలాగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఈవిడతలో 284 గ్రామపంచాయతీలను ఎ న్నుకోవడం జరిగిందని ఆవ్యర్ధాల నుంచి ఆదాయ వనరులను కూడా సమకూర్చుకునే ప్రణాళికలను అమలు చేయడం జరగాలన్నారు. జనవరి 1 నుండి ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇందుకు యంపిడివోలు ఆయా వార్డుల లబ్దిదారులతో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇకెవైసి ద్వారా పోర్టబులిటీ ద్వారా ప్రజాపంపిణి సరుకులు పొందే లబ్దిదారులనుకూడా గుర్తించాల్సిందే నన్నారు. జగనన్నతోడు లబ్దిదారుల ఎ ంపిక దృష్ట్యా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులను కూడా ఆయా సమీక్షలలో భాగస్వామ్యం చేయాలని శివశంకర్ తెలిపారు. జిల్లాలో వెనుకబడినతరగతుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టగలిగామని ఇంకా 8 శాతం డేటాను పూర్తి చేయాల్సి ఉందన్నారు. మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లుపై అడుగులు వేయాలని ఆయన సూచించారు. మోడల్ సచివాలయంలో ప్రతీ సోమవారం డ్రస్ కోడ్‌ను అమలు చేసామని, వచ్చే వారం నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ వార్డు , గ్రామ వార్డు సచివాలయాలలో అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యదర్శులు వారి పరిధిలోని స్కూళ్ల తనిఖీలను చేపట్టాలని ఇందుకు యంపిడివోలు, మండల స్ధాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లతో వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం స్లోగన్స్‌తో కొవ్వొత్తులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టరు ప్రారంభించి వారితో కలిసి కధం తొక్కారు. ఈకార్యక్రమంలో పలువురు జిల్లాస్ధాయి అధికారులు, యంపిడివోలు, ఇఓపిఆర్ డి, గ్రామకార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.