కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగుల శ్రమదానం..


Ens Balu
6
Vizianagaram
2020-12-08 15:35:53

విజయనగరం కలెక్టరేట్ లోని వివిధ శాఖల కార్యాలయాల్లో, పరిసరాలలో మంగళవారం శ్రమదానం చేపట్టారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించి ఆయా కార్యాలయాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ స్వయంగా చీపురు చేతబట్టి కార్యాలయంలో ఊడ్చారు. ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ఆడిటోరియం సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలను ఆయన తొలగించారు. షటిల్ కోర్టును శుభ్రం చేశారు. నూతనంగా మరొక షటిల్ కోర్టు ఏర్పాటు చేయాలని డి.ఆర్.వో. ఎం.గణపతిరావుకి ఈ సందర్భంగా సూచించారు. షటిల్ కోర్టు సమీపంలో లైట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట మట్టి వేయించాలని కూడా చెప్పారు. ఈ క్రమంలో కాసేపు సిబ్బందితో కలిసి షటిల్ ఆడి అందరినీ ఉత్తేజపరిచారు. అనంతరం కలెక్టరేట్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో చేపట్టిన శ్రమదానం పనులను పరిశీలించారు. పాల్గొన్న అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. మేము సైతమంటూ మహిళా సిబ్బంది.. మన కార్యాలయం మనమే శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన పిలుపును అందుకొని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందీ హాజరయ్యారు. వీరితో పాటుగా వివిధ విభాగాల్లో పని చేసే పలువురు మహిళా అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో శ్రమదానానికి విచ్చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉదయం 7:00 నుంచి 10:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో వారి వంతు శ్రమ చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ చేత శెభాష్ అనిపించుకున్నారు. చీపుర్లు చేతబట్టి కలెక్టరేట్ ఆవరణలో, పరిసరాలలో చెత్త ఊడ్చారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరిపారేశారు. తొలగించిన చెత్తను, వ్యర్ధాలను ట్రాక్టర్లలో వేశారు. ఈ పనుల్లో చురుగ్గా వ్యవహరించిన మహిళా అధికారులను, సిబ్బందినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.  ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో. ఎం.గణపతిరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఏవో దేవ్ ప్రసాద్, క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఖజానా శాఖ, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ, సర్వే & లాండ్ రికార్డ్స్ విభాగం, బి. సి. సంక్షేమ శాఖ, ఇతర శాఖల అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.