ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు..
Ens Balu
1
Kakinada
2020-12-08 15:38:14
తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. ఏలూరు సంఘటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి కాకినాడ కుళాయి చెరువు వద్ద ఉన్న విక్టోరియా వాటర్ వర్క్స్, శశికాంత్‌నగర్ ప్లాంటు ప్రాంగణాలను తనిఖీ చేశారు. నీటి సరఫరా తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగు నీటి నాణ్యత విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్దేశ ప్రమాణాల మేరకు మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విక్టోరియా వాటర్ వర్క్స్ పాయింట్ నుంచి కాకినాడలోని 60 శాతం ప్రాంతానికి నీటి సరఫరా జరుగుతోందని, మిగిలిన 40 శాతం ప్రాంతానికి శశికాంత్‌నగర్ ప్లాంట్ నుంచి సరఫరా అవుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా జిల్లాలోని మునిసిపల్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నీటి శుద్ధి ప్రక్రియ అనంతరం నీటి సరఫరా జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పైపులైన్ల లీకేజీపై ఫిర్యాదులు అందితే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నీటి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. అదనపు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాడు-నేడు విధానంలో నీటి సరఫరా వ్యవస్థల ఆధునికీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నమూనాలు తీసుకొని పరీక్షలు చేస్తున్నామన్నారు. అయితే ఎవరైనా అస్వస్థతకు గురైతే నిర్లక్ష్యం చేయకుండా, సొంతవైద్యంపై ఆధారపడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణ రాజు, ఈఈ పి.సత్యకుమారి, డీఈఈ ఎస్.ప్రభాకరరావు తదితరులు ఉన్నారు.