11న బిసి కార్పోరేషన్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం..


Ens Balu
1
Vijayawada
2020-12-08 16:00:53

బి.సి. ల సంక్రాంతి పండుగ పేరుతో ప్రభుత్వం నియమించిన 56 మంది ఛైర్మన్ లు, డైరెక్టర్లు ఈనెల 11వ తేది ప్రమాణస్వీకారం చేయనున్నారని రాష్ట్ర పంచాయతిరాజ్, కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని బి.సి.ల ప్రమాణస్వీకారం ద్వారా వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని చెప్పారు. స్ధానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌ల, డైరెక్టర్ల ప్రమాణస్వీకార ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఏలూరులో నిర్వహించిన బి.సి. గర్జనలో డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన తరగతుల కులాలకు అండగా ఉంటానని వారికోసం ప్రత్యేక కార్పోరేషన్‌లను ఏర్పాటు చేస్తానన్న హామి ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 139 బి.సి. కులాలకు 56 కార్పోరేషన్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బి.సి.లకోసం ఇన్ని కార్పోరేషన్లు ఏర్పాటుచేస్తున్న సందర్భంగా దేశంలో ఏరాష్ట్రంలో లేదన్నారు. బి.సి.ల కోసం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ముందుచూపు గొప్ప ఆలోచనలతో వారికి తగిన గుర్తింపును ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారని ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు స్ధానిక ఇందిరాగాంధి స్టేడియంలో ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. 6 వేలమంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని అందుకు అనుగుణంగా పాస్‌లు కూడా జారీ చేస్తామన్నారు. బి.సి.లకు వెన్నుగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి.. మంత్రి వేణుగోపాలకృష్ణ ః- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారిని కల్చర్ ఆఫ్ ఇండియాగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి గుర్తించారన్నారు. నిజమైన బి.సి.ల ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిలిచారన్నారు. బి.సి. కార్పోరేషన్‌ల ఏర్పాటుకోసం అధ్యయన కమిటీ వేసి ఏడాది వ్యవధిలో 139 కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్‌లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. వీరిలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, 29 ఛైర్మన్‌లను, 339 మంది డైరెక్టర్లగా మహిళలను నియమించడం జరిగిందన్నారు. బి.సి.లకు పెద్ద ఎ త్తున కార్పోరేషన్‌లు ఏర్పాటుచేయడం ద్వారా వారి కల నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ఈకార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఒకేవేదికపై డైరెక్టర్లు, ఛైర్మన్‌ల ప్రమాణస్వీకారం ఏర్పాటుచేయడం ద్వారా బి.సి.లకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డిశంబరు 11న నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లుపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్ధాయి అధికారులు స్టేడియం పరిశీలన అనంతరం తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈసందర్శనా కార్యక్రమంలో దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ , సెక్రటరి బి.రామారావు, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, డిసిపి హర్షవర్ధనరాజు, జేసి-3 కె. మోహనరావు, వైయస్ఆర్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.