రోస్టర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-12-08 17:28:13

విద్యుత్ శాఖలో ఖాళీగా వున్న షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను నిబంధనలు మేరకు రిజర్వేషన్స్ తో మాత్రమే భర్తీ చేయాలని విద్యుత్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ ఏవీ కిరణ్, ఈపీడీసీఎల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ చొప్పల సాయి బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం విశాఖ లోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్ ని కలిసి పలు సమస్యల  పరిష్కారం  విషయమై చర్చించారు.  కార్పొరేట్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియా తో మాట్లాడారు. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు గత కొన్నేళ్లుగా ఇతర కులాలకే కట్టబెట్టారని రోస్టర్ ని ఏ మాత్రం పట్టించుకోలేదని విన్నవించారు. ఇప్పటికయినా బ్యాక్ లాగ్ పోస్టు లతో బాటు అన్ని పోస్టు లను నిబంధనలు మేరకు భర్తీ చేయాలనీ కోరారు.  షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను నిబంధనలు మేరకు ఎస్సీ ఎస్టీ లతో భర్తీ చేయాలని నిర్ణయించి ఆదేశాలు ఇచ్చినా వాటిని కొందరు స్వార్థపరులైన అధికారులు, కొందరు నాయకులు కలిసి అడ్డుకోవడం  దారుణమని పేర్కొన్నారు.  అలాగే ఎస్సీ ఎస్టీ అధికారులను మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఫోకల్ ప్రాంతాల్లో నియమించాలని కోరారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేలా ఎస్సీ ఎస్టీ ఇంజనీరింగ్  అధికారులను నియమించాలని అప్పుడే అయిదు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కాలనీలకు న్యాయం జరుగుతుందన్నారు. యూనియన్ నేతలకు గత 20ఏళ్ళుగా అమల్లో ఉన్న  ఫుల్ టైమ్ పర్మిషన్ ప్రివిలేజ్ ను ఈ ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. గణేశ్వరరావు, విశాఖపట్నం అధ్యక్షులు పి. ఈశ్వర్ రావు, కార్యదర్శి సీహెచ్  రుషికేష్, విజయనగరం జిల్లా నిర్మల మూర్తి, ఈపిడీసీఎల్  అదనపు కార్యదర్శి ఎం లక్ష్మణరావు, కోశాధికారి రాజేష్  తదితరులు పాల్గొన్నారు.