ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నద్ధం కావాలి..


Ens Balu
3
విజయవాడ
2020-12-08 17:41:52

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న లబ్దిదారులకు ఇళ్లపట్టాల పంపిణి, నిర్మించిన ఇళ్ల పంపిణీని విజయవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ కోరారు. మంగళవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో టిడ్కో, జిల్లా గృహనిర్మాణసంస్ధ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నిరుపేదలకు ఇంటిస్ధలాల పట్టాలపంపిణికోసం 3 లక్షల 34 వేల మంది లబ్దిదారులను గుర్తించామని కలెక్టరు చెప్పారు. ప్రభుత్వం గృహనిర్మాణాలకోసం లబ్దిదారుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే ఇంటి నిర్మాణాల్లో రూ. లక్షా 50 వేల రూపాయలు కేంద్రం ద్వారా అందిస్తామన్నారు. పేద, నిరుపేద ప్రజలపై ఎ టువంటి ఆర్ధికభారం పడకుండా మొత్తం ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుందన్నారు. గుర్తించిన లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. డిశంబరు 25 ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పట్టాలను పంపిణి చేయడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. రాష్ట్రస్ధాయి వేఢుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని ఇందులో భాగంగా జిల్లా స్ధాయి, మండల స్ధాయిల్లోనూ పట్టాల పంపిణి కార్యక్రమాలను చేపడుతున్నామని కలెక్టరు ఇంతియాజ్ తెలియజేశారు. అదేరోజు టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన 7 వేల 742 మంది లబ్దిదారులకు నిర్మించిన ఇళ్ల పట్టాలను అందించడం జరుగుతోందన్నారు. గృహనిర్మాణాల కోసం ఎ ంతో విలువైన స్ధలాన్ని లబ్దిదారులకు పట్టాలను అందించే దిశలో పట్టణప్రాంతాలలో ఒకసెంటు, గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్లు భూమిని అందించనున్నామన్నారు. జిల్లాలో ఇందుకోసం ఇప్పటికే 1400 లకు పైగా లేఅవుట్లను సిద్ధం చేసామన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయ శాఖలతో కలిసి పూర్తి చేయాలని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ఇంటి నిర్మాణంకోసం స్ధలాలు కేటాయించిన లబ్దిదారుల ద్వారా ఫేజ్-1 లో ఇంటినిర్మాణాలు ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసి ఉందని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు.