రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా తెలిపారు. అనంతపురం వచ్చిన ఆయన మంగళవారం ఆర్అండ్బీ అతిథి గ్రుహంలో మీడియాతో మాట్లాడారు. కుల,మత,వర్గ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చేపట్టిన తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను వందశాతం నెరవేరుస్తున్నట్లు తెలిపారు .గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయిందన్నారు . ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ను పవిత్ర భగవద్గీత ,ఖురాన్, బైబిల్ గా భావించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా హామీలను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్నారన్నారు .మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు .మొదటి కేబినెట్ లోనే 60 శాతం పదవులను ఆవర్గాలవారికి కల్పించారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాబినెట్లో ఐదు మంది ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవులను కల్పించారన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుతో పాటు , ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రానున్న రోజుల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ మనబడి నాడు-నేడు పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నూత్న మైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.రైతుల పక్షపాతిగా రైతు భరోసాకేంద్రాల ఏర్పాటు, పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్, మద్దతు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాల పంపిణీ మరియు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటున్నారన్నారు.గత ప్రభుత్వం విద్య, వైద్యం ,వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆయా రంగాలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా చర్యలు తీసుకున్నారన్నారు.కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే విధంగా రాష్ట్రంలో సుమారు ఒక కోటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.
వెనుకబడిన ఎస్సి, ఎస్టీ ,బిసి, మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 45 -60 వయస్సు కలిగిన మహిళలకు వైయస్సార్ చేయూత కార్యక్రమం ,విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల నేడు ఎంతో మంది ముస్లిం,మైనార్టీ వర్గాల్లోని యువతీ, యువకులు డాక్టర్లుగా,ఇంజనీర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు.ఈ రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం గతం కంటే మిన్నగా బడ్జెట్ కేటాయించి ముస్లీమ్,మైనార్టీల పక్షపాతిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు.
ఈ సమావేశంలో అనంతపురం, రాప్తాడు శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి , తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.