మీకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదు..ఇంకెప్పుడు విధినిర్వహణ సక్రమంగా చేస్తారంటూ జివిఎంసీ కమిషనర్ డా.స్రిజిన శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోన్-1 పరిధిలోని బింద్రానగర్ ప్రాంతంలో జివిఎంసి కమిషనర్ పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆ ప్రాంతాలలో వాహనం ద్వారా చెత్తను గృహాల నుంచి సేకరించిడం ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భాగంగా ఆప్రాంత వాసులను గృహాల నుండి చెత్తను తీసుకొని వెళ్ళుటకు ప్రతీ రోజూ సిబ్బంది మరియు వాహనం వస్తుందీ లేనిదని, చెత్తను వేరుచేసి ఇవ్వాలని సిబ్బంది అడుగుతున్నారా లేదా అని అడిగితెలుసుకున్నారు. చెత్తను వేరు చేయకుండా ఇస్తున్నామని అక్కడ ప్రజలు చెప్పగా, వేరుచేసి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు చెత్త వేరు చేయడంపై సంపూర్ణ అవగాహన కల్పించకుండా అలసత్వం ప్రదర్శించిన ఐదవ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు , ఆ ప్రాంత శానిటరీ కార్యదర్శి జీతాల నిలుపుదల చేయాలని సహాయ మెడికల్ ఆఫీసరును ఆదేశించారు. ఆ ప్రాంతంలో రోడ్డును తుడిచి చెత్తను ఎత్తకుండా రోడ్డు ప్రక్కనే పోగు పెట్టడం గమనించి, కార్మీకురాలు వద్ద డబ్బా వంటిది లేక పోవడం గమనించి, ఆమెను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినందుకు ఆమెకు ఒక రోజు వేతనం నిలపాలని ఆదేశించారు. అపార్ట్మెంట్స్ నుండి ఖాళీ స్థలాలలో చెత్త వేయడం గమనించి వారి వద్ద నుండి జరీమనాలు విధించాలని ప్రజా ఫిర్యాదు మేరకు బింద్రానగర్ పరిసర ప్రాంతాలలో కాలువలు నుండి చెత్తను తొలగించి సాయంత్రంలోగా నివేదిక పంపాలని శానిటరీ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. ఖాళీస్థలాలలో చెత్త, తుప్పలను తొలగించని స్థల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఏ.ఎం.ఓ.హెచ్.ను ఆదేశించారు. బింద్రానగర్ ప్రాంతంలో ఇండ్ల వద్ద ఎరువును(హోమ్ కంపోస్టు) తయారు చేసి, స్వయంగా వారి అవసరాల కొరకు ఉపయోగించడాన్ని, స్థానికంగా గృహాలకు వెళ్లి పరిశీలించి, సేంద్రీయ ఎరువు వినియోగాన్ని మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఐదవ వార్డులో డ్రైనేజి ఏర్పాటుకుగాను కావలసిన ప్రైవేటు స్థలాల్ని, నాల్గవ వార్డులో రోడ్డు ఏర్పాటుకు కావలసిన ప్రైవేట్ స్థలాన్ని ఇంజినీరింగు మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కలసి పరిశీలించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రాము, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాదరాజు, ఏ.ఎం.ఓ.హెచ్. జయరాం, ఏ.సి.పి., కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు(మెకానికల్), సహాయక ఇంజినీరు(నీటిసరఫరా), శానిటరీ ఇన్ స్పెక్టరు, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.