రాజమహేంద్రవరంలో రౌడీయిజాన్ని సహించేది లేదని, తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షార్హులే నని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రౌడీ మూకలను సహించేది లేదని, ఎక్కడికక్కడ రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని, రౌడీ మూకలను, బ్లేడ్ బ్యాచ్ లను గుర్తించి నగర బహిష్కరణ చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రౌడీయిజాన్నే సహించలేమని మొత్తుకుంటుంటే ఇక వర్గాలకు తావెక్కడుంటుందని ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. స్థానిక ఐదు బళ్ల మార్కెట్ వద్ద జరిగిన దాడి ఘటనపై పోలీసులు త్వరితగతిన విచారణ జరిపి సత్వరం నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ రామ్ పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రశాంతతకు భంగం కల్గిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాభివృద్ధి పై దృష్టి పెట్టి చారిత్రాత్మకమైనరాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఏదేమైనప్పటికీ నగరంలో రౌడీయిజం పై చర్యలు తీసుకోవాలని, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా నిష్పక్ష పా తంగా చర్యలు తీసుకోవాలని కోరారు.