భూసర్వే అనంతరం యూనిక్ ఐడీ..


Ens Balu
2
Visakhapatnam
2020-12-09 22:05:07

రాష్ట్రంలో భూములు సర్వే అనంతరం ప్రతి ఒక్కరికి యూనిక్ ID కార్డు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం వై.యస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత భూ రికార్డులు, భూ స్థితికి ప్రతిబింబించేలా లేకపోవటం, ఏదైనా ఆస్థి అమ్మాలన్నా కొనాలన్నా పలు సందేహాలతో రెవెన్యూ, సర్వే, రిజిష్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగటం, అర్జీలు పెట్టి వేచి చూసే పరిస్థితి లేకుండా ఉంటుందన్నారు.  ప్రతి గ్రామం, హేబిటేషన్, పట్టణ ప్రాంతాలలో ఉన్నప్రజలకు రీ సర్వే పై వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి ప్రాపర్టీకి ఒక యూనిక్ ఐ.డి. ఇస్తారన్నారు.  సర్వే, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూకు సంబంధించిన సర్వీసులు సచివాలయాల్లోనే ఉంటుందన్నారు.  భూముల రీ సర్వే వలన గ్రామాల్లో ఉన్న వివాదాలు సమసిపోతాయని వివరించారు.  ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. సర్వే టీం ప్రతి గ్రామంలో, మండలంలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి ఒక మొబైల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  భూ సమస్యలు ఉంటే వెంట వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు.  డివిజన్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.  గ్రామాల్లో హద్దులు, మార్కింగ్ లను పూర్తి చేయాలన్నారు. వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పై కొలత రాళ్లు కొనుగోలు చేయాలని తెలిపారు.  ప్రతి ఒక్కరు డిశంబరు 14-19 వరకు జరిగే మొదటి విడత గ్రామ సభలలో పాల్గొని, సర్వే ప్రక్రియ, లాభాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు, ప్రజల సందేహాలు నివృత్తిచేయాలన్నారు. 21 డిశంబరు, 2020 నుండి ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎటువంటి అర్జీ పెట్టకపోయినా సంపూర్ణమైన సర్వే నిర్వహణ, యాజమాన్యపు హక్కు నిర్థారణ, రికార్డులలో నమోదు అవటం జరుగుతుందని పేర్కొన్నారు.  14 వేల మంది సర్వేయర్లు ఉన్నారని, 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ జరుగుతుందని, మిగిలిన సర్వేయర్లకు శిక్షణ జరిగే విధంగా కలెక్టర్లు చూడాలని చెప్పారు. భూముల రీ సర్వే వలన ప్రయోజనాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు.  ఈ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.   వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జివియంసి కమీషనర్  జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్. విజయ్ కుమార్, ఎ.ఓ. , తదితరులు పాల్గొన్నారు.