త్వరితగతిన కేసులు పరిష్కారం..
Ens Balu
3
Srikakulam
2020-12-12 21:02:32
జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.రామకృష్ణ కక్షిదారులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, దీనితో పాటు వర్చువల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. కక్షిదారులు కోర్టులకు రాకుండా వారు ఉన్న ప్రాంతం నుండే వారి కేసు వివరాలు, రాజీ షరతులను మెయిల్ ద్వారా పంపినట్లయితే వాటిని పరిశీలించి తిరిగి అవార్డును తయారుచేసి వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. కోర్టులు ఉండగా లోక్ అదాలత్ ను ఎందుకు ఆశ్రయించాలనే భావన చాలా మందికి ఉంటుందని, అయితే కోర్టులను ఆశ్రయించేవారిలో ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని, తీర్పు అనుకూలంగా రానివారు వేరే కోర్టులను, ఆపై కోర్టులను ఆశ్రయించే అవకాశముందని, తద్వారా ధనం, సమయం వృధా అవుతుందని చెప్పారు.
కానీ ఇరువర్గాల రాజీమార్గంతో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించడం వలన ఉభయులకు సమన్యాయం జరుగుతుందని, అలాగే కోర్టుకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగిచెల్లించడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు. కోర్టులకు వచ్చిన కేసులు, కోర్టులకు రాకముందు ఉన్న కేసులను ( ప్రీలిటిగేషన్ ) కక్షిదారులు ఒక ఆర్జీ రూపంలో రాసి ఇచ్చినట్లటయితే, రాజీమార్గం ద్వారా ఉభయులు తెలిపిన షరతులకు లోబడి చట్టబద్ధమైన వాటిని పరిగణలోకి తీసుకొని అవార్డును జారీచేయడం జరుగుతుందని, ఇరువర్గాల రాజీమార్గం ద్వారా పరిష్కరించబడినందున వేరే కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం లేకుండా తుదితీర్పు అవుతుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. త్వరితగతిన శాస్వతమైన పరిష్కారం, సామరస్యపూర్వకమైన పరిష్కారం లోక్ అదాలత్ ద్వారా సాధ్యపడుతున్నందున లోక్ అదాలత్ కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
ఈ అదాలత్ ద్వారా సివిల్ , క్రిమినల్ , చెక్ బౌన్స్, ప్రీలిటిగేషన్, మోటారు వాహనాల నష్ట పరిహారం వంటి కేసుల్లో ఎలాంటి కాలహరణం లేకుండా తక్షణమే కేసును పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని, ప్రతీ నెల లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ప్రతీ రెండు,మూడు మాసాలకు మెగా లోక్ అదాలత్ ద్వారా వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19 కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, ప్రధాన కేంద్రంలో 4 బెంచ్ లను ఏర్పాటుచేయడం జరిగిందని కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించబడతాయని, ముఖ్యంగా రెవిన్యూ కేసులు ఎక్కువగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూసేకరణ చెల్లింపుల విషయంలో ఇరువర్గాల రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించబడుతున్నందున ఇటు ప్రభుత్వానికి, అటు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కక్షిదారులు ఇతర కోర్టులను ఆశ్రయించడం వలన కాలయాపన, ధనం వృధా అవుతుందని, కానీ లోక్ అదాలత్ ద్వారా ఎటువంటి ఖర్చులు కాబోవని, అదేవిధంగా ఉభయుల షరతులతో కేసులు పరిష్కరించబడుతున్నందున ఇరువర్గాలకు సమన్యాయం చేకూరుతుందని స్పష్టం చేసారు. ఇరువర్గాల రాజీమార్గంతో పరిష్కరించబడినందున ఇతర కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం కూడా ఉండబోదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ టి.వెంకటేశ్వర్లు, థర్ఢ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి.అన్నపూర్ణమ్మ, ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ యన్.రమేష్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్టు రమేష్, టౌన్ డి.యస్.పి యం.మహేంద్ర, సామాజిక కార్యకర్త బరాటం కామేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.