గ్రూప్ –1 పరీక్షలను పక్కాగా నిర్వహించాలి
Ens Balu
2
Srikakulam
2020-12-12 21:35:25
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న ఏ.పి.పి.యస్.సి గ్రూప్ – 1 పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబరులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు గ్రూప్ – 1 పరీక్షలు జరగనున్నాయని అన్నారు. శ్రీ వెంకటేశ్వర కళాశాలకు 117 మంది, శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలకు 195 మంది వెరశి 312 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం. వరకు సాగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని అన్నారు. కోవిడ్ దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు కోవిడ్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసారు. తప్పనిసరిగా శానిటైజర్, మాస్కు , సామాజిక దూరం పాటించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రధ్ధను కనబరచాలని, అభ్యర్ధులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఏదైనా సమస్యలు తలెత్తితే ఏ.పి.పి.యస్.సి సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, సెల్ నెం. 90145 50915 నెంబరును సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, పరీక్షలను సజావుగా , పక్కగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ యన్.రమేష్, ఎచ్చెర్ల తహశీల్ధారు యస్.సుధాసాగర్, ఉప తహశీల్ధారు బి.ప్రసాదరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి , ఏ.పి.ఎస్.ఆర్.టి.సి, పోలీస్ శాఖ , ఇతర శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.