భూముల రీసర్వేకి సర్వేయర్లు సిద్ధం కావాలి..
Ens Balu
1
Vizianagaram
2020-12-12 22:33:59
చారిత్రాత్మకమైన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పధకం క్రింద జరిపే రీ సర్వే కార్యక్రమానికి సర్వేయర్లంతా సన్నద్ధం కావాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు. భూముల సమగ్ర రీ సర్వే పధకం పై తసిల్దార్ లు, రెవిన్యూ అధికారు లు, సర్వేయర్ల తో శనివారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రీ సర్వే పై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఎలాంటి సందేహాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ముందుగా రీ సర్వే కు అవసరమగు రికార్డులను, మెటీరియల్ ను ,టెక్నాలజీ ను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమానికి నిర్దిష్ట కాల పరిమితిని విధించడం జరిగిందని అన్నారు. కాలం తో పాటు పరిగెడితేనే ముందుకు వెళ్ళగలమని , ఏ దశ లో ఆగినా వెనకబడి పోవడం ఖాయమని గుర్తించాలని అన్నారు. రెవిన్యూ చట్టాల పైన పూర్తీ స్థాయి లో అవగాహన పెంచుకోవాలని అన్నారు. రీ సర్వే పధకం క్రింద భూముల స్వచ్చీకరణ, రీ సర్వే , భూమి సెటిల్మెంట్ ను ఒకేసారి చేయవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్రమంతటా ఒకే సారి టైం బౌండ్ లో జరిగే కార్యక్రమం కావున పోటీ పడి పని చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే సర్వేయర్లకు శిక్షణలు పూర్తి చేయడం జరిగిందని మనసా వాచా పని చేసి తమ సమర్ధతల్ని నిరూపించుకోవాలని హితవు పలికారు. .
ఈ నెల 14 నుండి 19 వరకు గ్రామ సభలు నిర్వహించాలని, ఈ సభలలో సర్వే ప్రక్రియ, దాని లాభాలను ప్రజలకు వివరింఛి, వారికి కలిగే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. 21 నుండి ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎటువంటి అర్జీ పెట్టకపోయినా సంపూర్ణ మైన సర్వే నిర్వహణ, యాజమాన్యపు హక్కు నిర్ధారణ, రికార్డులలో నమోదు అవుతాయని వివరించలన్నారు. మొదటి విడత లో జిల్లాలో 499 గ్రామాల్లో సర్వే జరుగుతుందని, గ్రామ సరిహద్దులను ముందుగా నిర్ధారించాలని తెలిపారు. భూ యజమాని సమక్షం లోనే ఖచితమైన కొలతలు వేసి సర్వే చేయాలనీ, హద్దు రాళ్ళను ఉచితంగా వేయాలని తెలిపారు. ప్రతీ కమతానికి మ్యాప్, అదార్ మాదిరి విశిష్ట సంఖ్య నివ్వడం జరుగుతుందన్నారు. శాశ్వత హక్కుల కల్పనకు ఖచ్చితమైన భూ, రెవెన్యూ రికార్డుల నమోదు చేయడమే కాకుండా అభ్యంతరాల పరిష్కారానికి మొబైల్ టీం లను కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందని, చరిత్ర లో నిలిచిపోయే ఇలాంటి కార్యక్రమం లో పనిచేయడం గొప్పగా భావించి ప్రతి ఒక్కరు చిత్త శుద్ధితో పని చేయాలనీ కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానిశంకర్, సర్వే శాఖ అధికారులు, కే.ఆర్.ఆర్.సి ఉప కలెక్టర్ బాలా త్రిపుర సుందరి తదితరులు హాజరైనారు.