లోక్ అదాలత్ లో 878 కేసులు పరిష్కారం..
Ens Balu
2
Vizianagaram
2020-12-12 22:36:27
విజయనగరం జిల్లాలోని సంబంధిత అన్ని వర్గాల వారి సహకారంతో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం జిల్లాలోని న్యాయస్థానాల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తల గోపి అన్నారు. జిల్లావ్యాప్తంగా కక్షిదారులు, పోలీసులు, ప్రజల సహకారంతో లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా పలు సివిల్, క్రిమినల్ రాజీపడదగ్గ పలు కేసులను శాశ్వత పరిష్కారం చేయగలిగామని పేర్కొన్నారు. ఈజాతీయ లోక్ అదాలత్ లో 878 కేసులు రాజీమార్గంలో పరిష్కరించామని, దీనివల్ల 3,000 మంది లబ్దిపొందారని తెలిపారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.2,26,53,262 కోట్ల మొత్తాన్ని కక్షిదారులకు చెల్లించడం జరిగిందన్నారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, బ్యాంకు కేసులు, పలు సివిల్ క్రిమినల్ కేసులను, చెక్ బౌన్సు కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ కాలంలో నమోదైన కోవిడ్-19, పలు రకాల కేసులకు అపరాధ రుసుము విధించి ఆ కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ లోక్ అదాలత్‌ను పెద్ద ఎత్తున కక్షిదారులు వినియోగించుకొని లబ్దిపొందారని పేర్కొన్నారు.
ఈ లోక్ అదాలత్‌లో ఎస్.సి., ఎస్.టి. కోర్టు ప్రత్యేక 4వ జిల్లా న్యాయమూర్తి ఎస్.శారదాదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.లక్ష్మీరాజ్యం, మొదటి శ్రేణి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ బి.శ్రావణి, సీనియర్ న్యాయవాదులు కె.శ్రీనివాసరావు, పి.ధనుంజయరావు, జి.సత్యం, ఎం.భాస్కరరావు, జి.హెచ్.హిమబిందు, ఏ.వి.ఎల్.పద్మజ, పోలీసు, వైద్య శాఖ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.