గ్రూప్-1 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు..
Ens Balu
2
East Godavari
2020-12-12 22:48:32
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్ రాత పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. గండేపల్లి మండలంలోని సూరంపాలెంలో గల ఆదిత్యా ఇంజనీరింగ్ కాలేజీ; ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అలాగే పరీక్ష నిర్వహణపై నోడల్ అధికారిగా వ్యవహిరిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు అధ్యక్షతన శుక్రవారం రాత్రి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతినిధులు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లుతో పాటు రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు తగిన సూచనలిచ్చినట్లు పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, అమలాపురం వయా కాకినాడ మీదుగా బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను డిఆర్ఓ సత్తిబాబు కోరారు.
అభ్యర్థులకు సూచనలు:
- హాల్ టికెట్‌లో ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలి.
- పరీక్షా కేంద్రానికి ఉదయం 9.30 గంటలకు ముందే చేరుకోవాలి.
- పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకెళ్లకూడదు.
- అభ్యర్థులు సమాధాన పత్రాల్లో గుర్తింపు సూచికలు రాయకూడదు.
- బ్లూ లేదా బ్లాక్ పెన్నులను మాత్రమే ఉపయోగించాలి. రంగు స్కెచ్ పెన్నులు ఉపయోగించకూడదు.
- అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి.