అమ్మ ఒడి లబ్దిదారులు వివరాలను తెలపాలి..


Ens Balu
2
శ్రీకాకుళం
2020-12-13 20:19:24

శ్రీకాకుళం జిల్లాలో జగనన్న అమ్మ ఒడి వివరాలను ఈ నెల 14 వ తేదీ లోగా విద్యార్ధుల తల్లి తండ్రులు లేదా సంరక్షకులు సంబంధిత పాఠశాలలలో అందించాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన తల్లులు కాని సంరక్షకులు కాని వారి వార్షిక ఆర్ధిక సాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ఆన్ లైన్ ద్వారా చేయడం జరుగుతుందన్నారు.  ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన తల్లి/తండ్రి/సంరక్షకులు సంబంధిత పాఠశాలలలో ఆధార్, బ్యాంక్ అక్కౌంట్, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్, రైస్ కార్డు తదితర వివరాలను ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గం.ల లోపు అందించాలని తెలిపారు.  సదరు వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరి చూసి అమ్మ ఒడి పోర్టల్ లో నమోదు చేయడం  జరుగుతుందని తెలిపారు.  అమ్మ ఒడి పోర్టల్ నందు వున్న వివరాలను గ్రామ/వార్డు సచివాలయాలలో డిశంబరు 16వ తేదీన విడుదల చేస్తారని చెప్పారు.   ఇందులో నమోదైన వివరాలను డిశంబరు 17 నుండి 19వ తేదీలోగా సంబంధిత సచివాలయాలలో తల్లితండ్రులు లేదా సంరక్షకులు సరిచూసుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తప్పొప్పుల వివరాలను తెలపలసి వుంటుందని సదరు ప్రకటనలో వివరించారు.   సదరు అనర్హత పట్ల అభ్యంతరాలను సచివాలయాలలో విడుదల చేసిన స్టాండర్డు ఆపరేటింగ్ పధ్ధతి ద్వారా సంయుక్త కలెక్టర్ వారికి సమర్పించనున్నట్లు తెలిపారు. సరిచేసిన వివరాలను  సచివాలయాలో ఈ నెల 20 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు నోటీసు బోర్డునందు ప్రకటించడం జరుగుతుందని, మరలా తల్లి/తండ్రి/సంరక్షకులు వాటిని సరిచూసుకునే సౌలభ్యం కలిగించడం జరుగుతుందని చెప్పారు. మరలా సరిచేసిన తప్పొప్పులను డిశంబరు 26వ తేదీన అమ్మ ఒడి పోర్టల్ నందు ప్రకటించడం జరుగుతుందని, తుది జాబితా గ్రామ సభ ద్వారా ఆమోదించడం జరుగుతుందని చెప్పారు.  ఈ విధంగా ఆమోదించబడిన  తుది  జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి డిశంబరు 30 వ తేదీన జిల్లా కలెక్టరుకు సమర్పించడం జరుగుతుందని, కావున అమ్మ ఒడి లబ్దిదారులు  వారి వివరాలను సరి చూసుకనే అవకాశాన్ని వినియోగించుకోవాలని  సంయుక్త కలెక్టర్  సదరు ప్రకటనలో కోరారు.