సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకం..
Ens Balu
5
Vizianagaram
2020-12-13 22:03:11
సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ విజయనగరం జిల్లా పాత్రికేయులకు ఆన్లైన్ శిక్షణ తరగతులను నిర్వహించింది. ఈ సందర్భంగా విలేఖరులకు సమాచార శాఖ వేపాడ మండలం బొద్దాం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రెస్ అకాడెమీ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా మరింత క్రియా శీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయ పడ్డారు. తప్పులని తప్పుగా ఎత్తి చూపించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం నాయకులకు కలుగుతుందన్నారు.
ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులకు శిక్షణ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఇదో చక్కని వేదికని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపి బెళ్ళాన చంద్రశేఖర్ ని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు నీ సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేశ్ నీ సీనియర్ పాత్రికేయులు ఎలిసెట్టి సురేష్ నీ, మయూరి హోటల్ యజమాని సాంబశివరావు నీ పాత్రికేయులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. సీనియర్ పాత్రికేయుడు బూరాడ శ్రీనివాసరావు పర్యవేక్షణ లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణానికి చెందిన పలువురు జర్నలిస్టులు , సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.